టిఆర్ఎస్ ప్లీనరీ ప్రాంగణం సిద్ధం

టీఆర్ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా కొంపల్లిలో జరిగే ప్రతినిధుల సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ నుంచి భోజనాల దాకా ఎక్కడా ఇబ్బంది లేకుండా, ఏ లోటు లేకుండా చూశారు. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ సభలో మూడేళ్ల సంక్షేమ నివేదనే ప్రధాన ఎజెండా.

రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో.. ఈసారి ప్రతినిధుల సభను సంక్షేమమే ఎజెండాగా జరపడానికి టీఆర్‌ఎస్ సన్నద్ధమైంది. వేడుకను ఘనంగా జరపడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రతీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరవుతారు. అధికారికంగా 8 నుంచి 10 వేల మంది ప్రతినిధులు వస్తారని అంచనా. అనధికారికంగా 15 నుంచి 16వేల మంది వచ్చే అవకాశముంది. ప్లీనరీకి సంబంధించి గత వారం పది రోజులుగా నిర్విరామంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ నిర్వహణను 60 ఎకరాల్లో ప్లాన్ చేశారు. అందులో ప్రధాన వేదిక 5 ఎకరాల్లో ముస్తాబైంది.

ఎండాకాలం కావడంతో నిరంతరాయంగా మంచినీరు, మజ్జిగ అందజేస్తారు. అతిథి మర్యాదలకు లోటు లేకుండా 6 భోజనశాలలు ఏర్పాటు చేశారు. పార్కింగ్ విషయంలో హైదరాబాద్ నగరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రెండు వేల సైన్ బోర్డులు, ప్రత్యేక రహదారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో మొత్తం ఔటర్ రింగ్ రోడ్డు  మీదుగానే వాహనాలను మళ్లిస్తారు. దీనికి సంబంధించి వివిధ జిల్లాల నుంచి వచ్చేవారికి పక్కా సమాచారం అందించారు. దాదాపు 35 ఎకరాల్లో మూడు రకాల పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. అందులో 15 వేల వాహనాల వరకు నిలపవచ్చు.

31 జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులకు 31 కౌంటర్లు ఏర్పాటు చేసి, ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. మెడికల్ క్యాంపులు కూడా అందుబాటులో ఉంచారు. సభా స్థలిలో ఆరు ఫైర్ బ్రిగేడ్లు సిద్ధంగా ఉన్నాయి. వెయ్యి మంది వలంటీర్లు వైర్ లెస్ సెట్ల ద్వారా నిరంతరం కో ఆర్డినేట్ చేస్తుంటారు. పార్కింగ్ స్థలాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కళాకారులకు స్పెషల్ స్టేజీ అరెంజ్ చేశారు. ఏ,బీ,సీ కేటగిరీల్లో కారు పాసులు ఇష్యూ చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హైదరాబాదులో ఎక్కడా హోర్డింగులు ఏర్పాటు చేయలేదు. అధికారికంగా అవకాశం ఉన్నచోట మాత్రమే ఏర్పాటు చేశారు. ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదు.

రేపు ఉదయం పదిన్నరకు ప్లీనరీ మొదలవుతుంది. మొదట టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం అమర వీరులకు నివాళులు అర్పిస్తారు. తర్వాత అధ్యక్షుడి ఎన్నిక ప్రకటన ఉంటుంది. స్వాగతోపన్యాస అనంతరం అధ్యక్షుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆ తర్వాత తీర్మానాలు ప్రవేశ పెడతారు. ఒంటిగంటన్నరకు భోజన విరామం. గంట తర్వాత తిరిగి తీర్మానాలపై ప్రతినిధులు చర్చిస్తారు. సాయంత్రం ఐదు-ఐదున్నర మధ్యలో అధ్యక్షుడు ముగింపు ఉపన్యాసం చేస్తారు. దాంతో ప్లీనరీ పరిపూర్ణం అవుతుంది.