గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కృషి

గ్రామీణ స్థాయిలోని కులవృత్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో కుల వృత్తులకు ప్రోత్సాహం- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిపై సురేఖ తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కులవృత్తుల వారే తెలంగాణలో ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలోనే కులవృత్తులను అభివృద్ధి చేసేందుకు సీఎం పాటుపడుతున్నారని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమైక్య పాలనలో చతికిల పడిందన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు సీఎం కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు.

రైతులకు రుణాలు మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని సురేఖ తెలిపారు. 75 శాతం సబ్సిడీతో గొల్లకురుమలకు జూన్ 20 నుంచి గొర్రెపిల్లలను పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో చేనేత కార్మికుల సంక్షేమం కోసం రూ. 1200 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం సీఎం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. వెయ్యి ఎకరాల్లో కోట్లాది రూపాయలతో టెక్స్‌టైల్స్ పార్క్ ఏర్పాటు చేయడానికి సీఎం నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. సిరిసిల్లలో అపెరాల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. నాయి బ్రాహ్మణులకు 25 వేల మోడ్రన్ సెలూన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రజకుల కోసం దోబీ ఘాట్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ తీర్మానాన్ని టిఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బలపరిచారు.