ఎర్రబుగ్గ కార్లకు రెడ్ సిగ్నల్!

ఎర్ర బుగ్గ కార్ల వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభత్వం. వీవీఐపీలు, కేంద్ర మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన నేతలు, ఉన్నతాధికారులు ఎర్ర బుగ్గలను వినియోగించరాదని తెలిపింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల్లో మార్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మే 1 నుంచి నూతన నిబంధనలు అమల్లోకి రానున్నట్లు చెప్పారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండబోదన్నారు. అయితే, అత్యవసర సేవలైన పోలీస్, ఫైర్, ఆర్మీ, అంబులెన్సులు మాత్రం నీలం బల్బులను ఉపయోగించేందుకు అనుమతించారు.

నీలం బుగ్గల వినియోగంపై రాష్ట్రాలకు కూడా మార్గదర్శకాలు పంపనుంది కేంద్రం.  ఇందుకోసం మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయనున్నారు. వాటిపై నోటిఫికేషన్ విడుదల చేసి, మే 1 నుంచి నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌ సభ స్పీకర్‌ మాత్రం ఎర్రబుగ్గ కార్లను ఉపయోగించే అవకాశముంది. ఐతే, ప్రధాని మోడీ స్వచ్ఛందంగా ఎర్రబుగ్గను ఉపయోగించకుండా దూరం ఉండే అవకాశముంది.

కేంద్రం నిర్ణయంపై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, మహేష్ శర్మలు  వెంటనే తమ కారుకున్న బుగ్గను తొలగించారు. ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా ఎర్రబుగ్గను స్వయంగా తొలగించారు. ఇక గురువారం నుంచి ఎర్రబుగ్గ కారును ఉపయోగించకూడదని నిర్ణయించుకున్నారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్.

వీవీఐపీ కల్చర్ కు పుల్ స్టాప్ పెట్టేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తొలి అడుగు వేశారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు, నేతలు ఎర్రబుగ్గ కారును వినియోగించకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరిందర్ సింగ్ కూడా మంత్రులు, ఉన్నతాధికారులు ఎర్రబుగ్గ కారును వినియోగించరాదని ఆదేశించారు. ఇక యూపీ సీఎం యోగి కూడా ఎర్రబుగ్గ కార్లను వినియోగించడం స్వచ్ఛందంగా నిలిపివేయాలని కోరారు.

2002, 2005 లో కేంద్రం జారీ చేసిన  నోటిఫికేషన్ల ప్రకారం రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేబినెట్ మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, త్రివిధ దళాల అధిపతులు ఎర్రబుగ్గ వాహనాలు వాడొచ్చు. అయితే, నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఎర్రలైటు వాహనాలను ఉపయోగించేవారికి భారీగా జరిమానాలు విధించేలా మోటారు వాహనాల చట్టానికి సవరణలు తేవాలని సూచించాలంటూ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. నీలిరంగు బుగ్గలను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సుప్రీంకోర్టు గతంలో సూచనలు కూడా చేసింది.