స్వైపింగ్ మిషన్లున్నా గిట్టుబాటు లేదు!

పెద్ద నోట్ల రద్దు తర్వాత డిలా పడిపోయిన వ్యాపారాలకు.. ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ కొంత ఊరటనిచ్చాయి. ప్రజలు డిజిటల్‌ పేమెంట్స్‌ వైపు  మళ్లడంతో పెద్దపెద్ద షాపింగ్‌ మాల్స్‌, వస్త్ర దుకాణాలు, బంగారు దుకాణాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసి తద్వారా వ్యాపారాలను నెట్టికొస్తున్నారు. కానీ చిన్నచిన్న వస్త్ర దుకాణాలు, ఫుట్‌పాత్‌పై బట్టలు, చెప్పులు, బ్యాగులు, స్టీలు సామగ్రి, ప్లాస్టిక్‌ వస్తువులు అమ్మే వారి వద్ద స్వైపింగ్‌ మిషన్ల సౌకర్యం లేకపోవడంతో ఈ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.

హైదరాబాద్‌ కు వచ్చిన పర్యాటకులు చార్మినార్‌ ను చూడంది వెళ్లరు.  వీరితో పాటు  నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చార్మినార్‌ను వీక్షించేందుకు వస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా నిత్యం జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. వీరిని నమ్ముకుని ఇక్కడి చిరు వ్యాపారులు వ్యాపారం సాగిస్తుంటారు. ఐతే పెద్ద నోట్లు రద్దు తర్వాత చార్మినార్‌ దగ్గర వ్యాపారం డీలా పడిపోయింది.కొందరు వ్యాపారాన్ని వదులుకుంటే..మరికొందరు..చేసేదేమిలేక స్వైపింగ్‌ మిషన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఐతే కష్టమర్లు తక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తుండటంతో వ్యాపారులకు గిట్టుబాటు అవడం లేదు.  వచ్చే తక్కువ లాభంలో బ్యాంకులకు ట్యాక్స్‌ను పే చేయాల్సిన పరిస్థితి. ఇది ఒక ఎత్తైతే.. ఈ స్వైపింగ్‌ మిషన్లను మెయింటెన్‌ చేయడం భారంగా మారింది.దీనికి తోడు.. బ్యాంకులకు వెళ్లడం..డబ్బులను డ్రా చేసుకోవడం మరింత ఇబ్బందిగా మారింది.

మొత్తానికి ఆన్‌ లైన్‌ ట్రాన్సాక్షన్స్‌ చిరు వ్యాపారులకు తలకు మించిన భారం అవుతోంది. కొంత మంది చిరు వ్యాపారులు  వాటిని కొనే స్థోమతలేక , వినియోగం రాక ..ఇటు వ్యాపారాలను వదులుకోలేక ఇబ్బందులు పడుతున్నారు.