సెకండ్ ఇన్నింగ్స్‌కు రెడీ!  

మర్దాని సినిమా తర్వాత రాణీ ముఖర్జీ తెరపై కనిపించలేదు. దర్శకనిర్మాత ఆదిత్యా చోప్రాను పెళ్లాడి సినిమాలకు దూరమైనన ఆమె.. ఓ పాపకు జన్మనిచ్చింది. రెండేళ్ల విరామం తరువాత ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతోంది. వీ ఆర్ ఫ్యామిలీ ఫేమ్ సిద్దార్ధ్ మల్హోత్రా విభిన్నమైన కథాంశంతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కథానాయిక ప్రధానంగా సాగే ఈ సినిమాలో రాణీముఖర్జీ మానసిక వికలాంగురాలిగా కనిపించనుందట. తొలుత ఈ చిత్రాన్ని ఇమ్రాన్‌హష్మీ, అభిషేక్‌బచ్చన్‌లతో చేయాలనుకున్నాడట. అది కార్యరూపం దాల్చకపోవడంతో హీరో ప్రధానంగా సాగే ఈ స్క్రిప్ట్‌ని హీరోయిన్ ప్రధానంగా మార్చి రాణీముఖర్జీకి వినిపించాడట సిద్దార్ధ్ మల్హోత్రా. కథ వినూత్నంగా వుండటంతో ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యాచోప్రా నిర్మించడానికి అంగీకరించినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. రాణీముఖర్జీ గతంలో వచ్చిన బ్లాక్ చిత్రంలో అంధురాలిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నది.