సింగరేణిలో పండుగను మించిన సంతోషం

సింగరేణి కాలరీస్ తెలంగాణకు తలమానికమని సీఎం కేసీఆర్ అన్నారు. సింగరేణి అభివృద్ధికి మూలం వేలాదిమంది కార్మికుల శ్రమ అని కొనియాడారు. సింగరేణి కార్మికుల చిరకాల కోరికలను తమ ప్రభుత్వం నెరవేర్చిందని, వారి కుటుంబాల్లో ఎన్నడూ లేనంత సంతోషం నింపిందని చెప్పారు. సింగరేణి కాలరీస్ పై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. ఆయన మాటలు..

నల్లబంగారంగా భావించే అపారమైన బొగ్గు నిల్వలు రాష్ట్రంలోని కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి, విద్యుత్ ఉత్పాదనకు, పారిశ్రామిక ప్రగతికి మూలాధారమైన బొగ్గును ఉత్పత్తి చేస్తూ, వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. తెలంగాణ నేలగర్భంలో 10,528 మిలియన్ బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటికి 1249 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీశారు. మరో శతాబ్దకాలం వరకు ఉత్పత్తిని కొనసాగించేందుకు వీలైనన్ని బొగ్గు నిక్షేపాలు ఇంకా ఉన్నాయి.

కార్మికులు తమ కఠోర శ్రమతో భూగర్భంలోంచి బొగ్గును తవ్వితీస్తున్నారు. జాతి సంపదను పెంచడానికి స్వేదం చిందిస్తూ ప్రమాదపుటంచుల్లో పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ… దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికుల కృషికి ఏమాత్రం తీసిపోదనే సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో కూడా సింగరేణి కార్మికులు చూపించిన చైతన్యం సాటిలేనిది. అందుకే మా ప్రభుత్వం సింగరేణి కార్మికులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలను తీసుకున్నది.

1871వ సంవత్సరంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన డాక్టర్ విలియమ్ కింగ్ ఇల్లందు ప్రాంతంలో మొట్టమొదటిసారిగా బొగ్గు నిల్వలను గుర్తించాడు. ఈ బొగ్గు నిల్వల మీద 1886లో ఇంగ్లండ్ కు చెందిన డెక్కన్ కంపెనీ లిమిటెడ్ హక్కులు పొందింది. 1889లో ఖమ్మం జిల్లాలోని సింగరేణి అనే చోట బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు బొగ్గు దొరికే ప్రాంతాన్నంతా సింగరేణిగానే వ్యవహరిస్తున్నాము. నిజాం కాలంలో 1920 డిసెంబర్ 23న కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనే సంస్థ ఏర్పడింది. 1945లో నిజాం ప్రభుత్వం సంస్థలోని ఎక్కువ భాగాన్ని కొనుగోలు చేసి, మేనేజింగ్ ఏజంట్ గా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించింది. 1960 నుంచి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 49:51 నిష్పత్తిలో భాగస్వాములుగా సింగరేణిని నిర్వహిస్తున్నాయి.

దక్షిణ భారతదేశంలోనే బొగ్గు ఉత్పత్తి చేస్తున్న ఏకైక కంపెనీ సింగరేణి కావడం మన రాష్ట్రానికి గర్వకారణం. సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల థర్మల్ విద్యుత్ అవసరాలు తీరుతున్నాయి. ప్రతీ సంవత్సరం 600 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో 78.71 శాతం బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ అవుతుంది. రాష్ట్రానికి, దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తున్నది. ఇంకా, స్పాంజ్ ఐరన్, సిమెంట్, ఎరువులు, ఫార్మా తదితర పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కూడా సింగరేణే సరఫరా చేస్తున్నది.

ప్రస్తుతం సింగరేణిలో 46 గనులుండగా, అందులో 30 భూగర్భగనులు, 16 ఓపెన్ కాస్టు గనులున్నాయి. ఓపెన్ కాస్టు గనుల్లో షవల్ డంపర్, డ్రాగ్ లైన్, హైవాల్ పద్దతుల్లో బొగ్గును వెలికితీస్తున్నారు. భూగర్భ గనుల్లో లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బ్లాస్టింగ్ గాలరీ, ఎస్డీఎల్, ఎల్.హెచ్.డి. పద్దతులు అవలంబిస్తున్నారు. భూగర్భ గనుల్లో బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి చేయడానికి అనువైన భారీ ఆడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టు సింగరేణి కలిగిఉంది.

సింగరేణిలో మొత్తం 56,866 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భూగర్భ గనుల్లో 34,764 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఓపెన్ కాస్టు గనుల్లో 10,427మంది కార్మికులు పనిచేస్తున్నారు. 2015-16లో మొత్తం ఉత్పత్తి 600 లక్షల టన్నులు కాగా దీనిలో ఓపెన్ కాస్టు గనుల నుంచి 497 లక్షల టన్నులు, భూగర్భ గనుల నుంచి 106 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. అంటే 61 శాతం మంది పనిచేస్తున్న భూగర్భ గనుల్లో 17 శాతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంటే, 18 శాతం కార్మికులు పనిచేస్తున్న ఓపెన్ కాస్టుల ద్వారా 82 శాతం బొగ్గు ఉత్పత్తి అవుతున్నది.

భూగర్భ గనుల్లో టన్ను బొగ్గు కోసం అయ్యే ఉత్పత్తి వ్యయం 4,118రూపాయలు. కాగా అమ్మకం ధర 2360 రూపాయలు. అంటే ఒక్కో టన్నుకు 1758రూపాయల నష్టాన్ని సంస్థ భరించాల్సి వస్తున్నది. ఓపెన్ కాస్టు గనుల్లో టన్ను బొగ్గు ఉత్పత్తి వ్యయం 1204 రూపాయలు. అమ్మకం ధర 2,008 రూపాయలు. ప్రతీ టన్నుపైన 804 రూపాయలు లాభం వస్తున్నది. 2015-16 సంవత్సరంలో భూగర్భ గనుల వల్ల 1869కోట్ల రూపాయల నష్టం రాగా, ఓపెన్ కాస్టు గనుల ద్వారా 3998 కోట్ల రూపాయల లాభం వచ్చింది. ఇదే విధంగా గత ఆరు సంవత్సరాలలో భూగర్భ గనుల ద్వారా వచ్చిన నష్టం 8118 కోట్ల రూపాయలు కాగా, ఓపెన్ కాస్టు గనుల ద్వారా వచ్చిన లాభం 12469 కోట్ల రూపాయలు.

భూగర్భ గనుల ద్వారా వస్తున్న నష్టాన్ని ఓపెన్ కాస్టుల ద్వారా వస్తున్న లాభాలతో పూడుస్తూ సంస్థ ముందుకుపోతున్నది. లాభాలు తెచ్చిపెడుతున్న ఓపెన్ కాస్టు గనులు లేకుండా సింగరేణి కంపెనీ మనుగడ సాధ్యం కాదనే విషయాన్ని అందరం గమనించాలి. ఈ వాస్తవం గుర్తించి కోల్ ఇండియాతో సహా జాతీయ,అంతర్జాతీయ సంస్థలన్నీ ఓపెన్ కాస్టు విధానాన్నే అవలంభిస్తున్నాయనేది వాస్తవం. ఓపెన్ కాస్టు ప్రాంతాలలో పర్యావరణ రక్షణ కోసం ఇప్పుడు అమలవుతున్న విధానంకన్నా మెరుగైన, సమగ్రమైన విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తున్నది.

భూగర్భగనుల ద్వారా ఆర్థికంగా నష్టం వస్తున్నప్పటికీ, వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం భూగర్భ గనుల ద్వారా ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. భూగర్భ గనుల్లో నష్టాలను తగ్గించడం కోసం, లాభాల బాట పట్టించడం కోసం ప్రభుత్వం అన్నిప్రయత్నాలు చేస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్మికులకు అన్నివిషయాలు వివరించేందుకు మల్టీ డిపార్ట్ మెంట్ లెవల్ సమావేశాలు నిర్వహించాము. దీంతో కార్మికులు, అధికారులు సమన్వయంతో కొత్త ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ మార్పు వల్ల 2015-16లో 600 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి, 15శాతం వృద్ధి రేటును సాధించిన సింగరేణి నేడు దేశంలోనే నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది. కోల్ ఇండియా, ఇతర ప్రభుత్వరంగ సంస్థలకన్నా ముందున్నది.

2009-2014 మధ్య ఐదేళ్ల కాలంలో సగటున 3శాతం మాత్రమే వృద్ధిని సాధించిన సింగరేణి, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15శాతం వృద్ధి రేటును సాధించడం గమనార్హం. కార్మికులను విశ్వాసంలోకి తీసుకుంటూ ప్రభుత్వం అనుసరించిన విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయి. సింగరేణి లాభాల బాట పట్టింది. 2009-2014 మధ్య ఐదేళ్ల కాలంలో సింగరేణి ఆర్జించిన లాభం ఏడాదికి సగటున 400 కోట్లు. 2015-16లో సింగరేణి ఆర్జించిన లాభం 1066 కోట్లు.

కష్టపడి సింగరేణికి లాభాలు తెచ్చిపెట్టిన కార్మికులకు సముచిత వాటా ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఇటు సింగరేణి చరిత్రలో గానీ, అటు దేశ చరిత్రలో గానీ ఎన్నడూలేని విధంగా లాభాల్లో 23 శాతం వాటాను, అంటే 245 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించాము. దీపావళి బోనస్ కింద ప్రతీ కార్మికుడికి సగటున 54వేల రూపాయలు చొప్పున మొత్తం 303 కోట్ల రూపాయలు చెల్లించాం. ఈ విధంగా ఒక్క నెల రోజులలోపే దసరా, దీపావళి పండుగల సమయంలో ఒక్కో కార్మికుడు సగటున లక్ష నుంచి లక్షా 25వేల వరకు పొందారు. ఈ నిర్ణయం కార్మికుల ఇండ్లలో పండుగ ఆనందం కన్నా మించిన ఆనందం పంచింది.

సింగరేణి కార్మికులకు ఎంతో కాలంగా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల హక్కును 1998లో  అప్పటి ప్రభుత్వం రద్దుచేసింది. హక్కును పునరుద్ధరించమని కార్మికులు గత 18 ఏండ్లుగా మొరపెట్టుకుంటూనే ఉన్నారు. కానీ వారి వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. ఏళ్ల తరబడి కార్మికులు చేసిన సేవలకు గుర్తింపుగా వారు కోరిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం న్యాయమని మేము భావించాము. మేము అధికారంలోకి వస్తే డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్ధరిస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి డిపెండెంట్ ఉద్యోగాల హక్కును పునరుద్దరించాం. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల నియామక ప్రక్రియ మళ్లీ ప్రారంభమయింది. జనవరి1 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీంతో కార్మికుల కుటుంబాలలోంచి మరోతరం ఉత్పత్తిలో భాగం పంచుకోవడానికి సిద్ధమవుతున్నది. కార్మికుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.

అనారోగ్య కారణాల వల్ల అన్ ఫిట్ అయిన కార్మికుల వారసులకు ఉద్యోగం ఇచ్చే విషయంలో గత ప్రభుత్వాలు పరిమితి విధించాయి. ఏడాదికి 200 నుంచి 250 వరకు అన్ ఫిట్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ ఫిట్ అయిన వారి వారసులు 3,200 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వారసులకు ఉద్యోగం వద్దునుకునుకున్నప్పుడు కార్మికుడికి ఇచ్చే పరిహారాన్ని ఐదు లక్షల రూపాయల నుంచి 12లక్షల 50 వేల రూపాయలకు పెంచాము. గని ప్రమాదంలో కార్మికుల మరణిస్తే గత ప్రభుత్వాలు కేవలం 7 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేవి. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్స్ గ్రేషియాను భారీగా పెంచాం. సంస్థ కాంట్రిబ్యూషన్ కింద 10లక్షల రూపాయలు, కార్మికుల కాంట్రిబ్యూషన్ కింద మరో పది లక్షలు, ఎక్స్ గ్రేషియా ఐదు లక్షలు … మొత్తం 25 లక్షల రూపాయలు కార్మికుడి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందచేస్తున్నాం. కార్మికుడు ఉద్యోగంలో ఉండగా సహజ మరణం చెందితే, ఇచ్చే పరిహారం గతంలో కేవలం లక్షా 50 వేల రూపాయలు. ఇప్పుడు 15లక్షల రూపాయలు అందచేస్తున్నాం. ఈ విధంగా మెరుగైన పరిహారం ఇచ్చే పద్ధతి దేశంలో మరే ఇతర బొగ్గు కంపెనీలో లేదు.

కార్మికులకు పని పరిస్థితులను (వర్కింగ్ కండిషన్స్) మెరుగుపర్చేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. కార్మికులు గతంలో బరువైన క్యాప్ ల్యాంపులు ధరించి గనిలోకి దిగేవారు. కార్మికులకు ఈ కష్టం తప్పించేందుకు వీటిస్థానంలో లక్షలాది రూపాయలు వెచ్చించి కేవలం 400 గ్రాముల బరువుండే క్యాప్ ల్యాంపులు అందచేశాము. భూగర్భ గనిలోకి 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం నడవాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడా అవసరం లేకుండా ప్రతీ గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశాము. కోలిండియాలో కూడా ఇలాంటి మ్యాన్ రైడింగ్ సిస్టమ్ ఇంకా ప్రతీ గనిలోనూ కార్మికులకు అందుబాటులోకి తేలేదు. కార్మికులు నివసించే కాలనీలలో సమస్యలను పరిష్కరించడం కోసం ‘మీకోసం – మీ చెంతకు అనే వినూత్న కార్యక్రమాన్ని సింగరేణి అమలు చేస్తున్నది. కొత్త రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, స్విమ్మింగ్ ఫూళ్లు, వ్యాయామశాలలు ఏర్పాటు చేసింది.

తెలంగాణ గర్వించే సింగరేణి సంస్థను మరింత విస్తృత పరిచేందుకు, పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నది. వచ్చే ఐదేళ్ల కాలంలో 20 ఓపెన్ కాస్టు గనులు, 11 భూగర్భ గనులు కొత్తగా ప్రారంభించబోతున్నదని తెలియచేస్తున్నాను. ప్రస్తుతం 600 లక్షల టన్నులున్న బొగ్గు ఉత్పత్తిని 2020-21 నాటికి 900 లక్షల టన్నులకు పెంచాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకున్నది. దీని ద్వారా తెలంగాణలో నిర్మించే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు చాలినంత బొగ్గును అందించడంతో పాటు, వేలాది పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేయడం సాధ్యమవుతుంది. కొత్తగా 11,621 మందికి ఉద్యోగాలు వస్తాయి.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే బొగ్గును వెలికితీస్తున్న సింగరేణి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు విస్తరించేందుకు కార్యాచరణకు దిగింది. ఇప్పటికే కేంద్రం కేటాయించిన ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాకులో పని ప్రారంభించింది. విదేశాల్లో కూడా కార్యకలాపాలు విస్తరించడం కోసం సింగరేణి ప్రయత్నాలు చేసింది. ఆస్ట్రేలియా, అమెరికా, దక్షిణాఫ్రికా, చైనా, ఇండోనేషియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, కెనడా దేశాల్లో బొగ్గు వ్యాపారానికి ఉన్న అవకాశాలను సింగరేణి అధికారులు వెళ్లి పరిశీలించారు. సింగరేణితో కలిసి పనిచేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 13 కంపెనీలు ఆసక్తి చూపాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు పడిపోయాయి. కనుక సానుకూల పరిస్థితి ఏర్పడే వరకు వేచియుండాలని నిర్ణయించాము.

బొగ్గు ఉత్పత్తితో పాటు విద్యుత్ ఉత్పత్తి రంగంలోనూ సింగరేణి అడుగుపెట్టింది. జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును నిర్మించింది. గత ఆగస్టు 7వ తేదీన గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు ఈ ప్లాంటును జాతికి అంకితం చేశారు. త్వరలోనే సింగరేణి సంస్థ మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తున్నది. బొగ్గును, విద్యుత్తును రెండూ సింగరేణే ఉత్పత్తి చేయడం వల్ల కరెంటు ఉత్పత్తి వ్యయం తగ్గుతున్నది. అందువల్ల తెలంగాణ డిస్కమ్ లకు ఇతరుల కన్నా తక్కువ ధరకు సింగరేణి విద్యుత్ ను అందిస్తున్నది. ఆ విధంగా సింగరేణితో తెలంగాణ డిస్కమ్ లకు కూడా ప్రయోజనం కలుగుతున్నది.

యాజమాన్యం, కార్మికులు అనే విభజనకు అతీతంగా, సింగరేణి అంతా ఒకే కుటుంబంగా భావించి ఉత్పత్తిలో పాలుపంచుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మా పిలుపును ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కార్మికులు ప్రతి స్పందించారు. చేయి చేయి కలిపి సింగరేణిని ప్రగతిపథంలో నిలిపేందుకు పరిశ్రమిస్తున్నారు. అందరూ ఒకటే అనే భావన కలిగేందుకు వీలుగా కార్మికులు, అధికారులు ఒకే యూనిఫాం ధరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు, సకల జనుల సమ్మె కాలానికి వేతనం, లాభాల్లో పెద్ద వాటా, బోనస్, ఎక్స్ గ్రేషియా పెంపు, డిపెండెంట్ ఉద్యోగాల హక్కు పునరుద్ధరణ లాంటి చర్యలు సింగరేణి కార్మికుల్లో ప్రభుత్వం పట్ల ఎనలేని విశ్వాసం పెంచాయి. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపు దిద్దేందుకు నల్లబంగారాన్ని వెలికితీస్తూ గొప్ప సంపదను సృష్టిస్తున్నకార్మికలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.