సామాన్యులపై మోడీ సర్జికల్ స్ట్రైక్స్

కాంగ్రెస్‌ నేతలంతా మూకుమ్మడిగా ప్రధాని మోడీని టార్గెట్‌ చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితులు సహా రెండున్నరేళ్లలో బీజేపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన జన్ వేదన సమ్మేళన్‌ లో కాంగ్రెస్‌ అగ్రనేతలంతా పాల్గొన్నారు.

ప్రధాని మోడీపై కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌ రాహుల్‌ తీవ్ర విమర్శలు చేశారు. నోట్ల రద్దు పేరుతో పేదలు, మధ్యతరగతి పై ప్రధాని మోడీ సర్జికల్‌ స్ట్రైక్స్ చేశారని ఫైరయ్యారు. బీజేపీ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ రెండూ దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలను భయాందోళనకు గురిచేయటమే బీజేపీ లక్ష్యంగా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో మాత్రమే ప్రజలకు అచ్చేదిన్‌ ఉన్నాయని చెప్పారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సైతం…. ప్రధాని మోడీ తీసుకున్న డిమానిటైజేషన్‌ నిర్ణయంపై మరోసారి విమర్శలు గుప్పించారు. నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్ధికవ్యవస్థ పూర్తిగా మందగించిందని అన్నారు. జీడీపీ రేటు 6.3 శాతానికి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా దేశ తలసరి ఆదాయం పెరుగుతోందని కేంద్రం చేస్తున్న ప్రచారం అంతా అబద్దమని చెప్పారు.

భారత్ ను క్యాష్ లెస్ సొసైటీగా మార్చడం సాధ్యమయ్యే పని కాదన్నారు కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరం. ప్రపంచంలో ఇప్పటి వరకు వంద శాతం క్యాష్ లెస్ ద్వారా నడుస్తున్న దేశం ఒక్కటి కూడా లేదన్నారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు పెద్ద నోట్లను రద్దు చేశామంటున్న ప్రధాని… ఏ మేరకు వాటిని కట్టడి చేయలగలిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా ఆమె ఈ సదస్సుకు రాలేకపోయారు. దీంతో మొత్తం బాధ్యతను రాహుల్ గాంధీ తన భుజాన వేసుకున్నారు. కాంగ్రెస్‌ బడా నేతలంతా ఈ సదస్సు కు హాజరవటం విశేషం.