షారుక్‌తో ఐశ్వర్య జోడీ?

షారుక్‌ఖాన్‌ ఐశ్వర్యరాయ్‌ కలిసి నటించబోతున్నట్లు బాలీవుడ్ టాక్‌. పైగా సంచలన దర్శకుడు సంజయలీలా బన్సాలి ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం. దివంగత హిందీ చలనచిత్ర గేయ రచయిత సాహిర్‌ లూధియాన్వి జీవిత చరిత్ర ఆధారంగా సంజయ్‌ ఈ సినిమా నిర్మిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు సఫలమైతే షారుక్‌ఖాన్‌ సాహిర్‌ లూధియాన్విగా, ఐశ్వర్యరాయ్‌ బచన్‌ పంజాబి కవయిత్రి అమృతా ప్రీతంగా నటించవచ్చు. ఆ రోజుల్లో సాహిర్‌ – అమృతాల మధ్య విడదీయని ప్రేమానుబంధం ఉండేదని బలీయమైన వార్త చలామణిలో ఉండేది. సంజయ లీలా బన్సాలి నిర్మించబోయే సినిమాకి ‘గుస్తాఖియాన్‌’ అని నామకరణం కూడా జరిగినట్లు తెలుస్తున్నది. ఇందులో ముఖ్యంగా సాహిర్‌ రచించిన గజళ్లు, నజ్మ్‌ వంటి ఉర్దూ కవితలు ఉంటాయట. అటు  ఐశ్వర్యరాయ్‌ని ఈ విషయం గురించి విలేకరులు ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని బదులిచ్చింది. ఐశ్వర్యరాయ్‌కి సంజయలీలా బన్సాలీ అంటే ఎంతో గౌరవం. అసలు రామ్‌-లీలా సినిమాలో తొలుత హీరోగా సల్మాన్‌ఖాన్‌ని, హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్‌ని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరొక వార్త కూడా వినపడుతోంది. సంజయ్‌లీలా బన్సాలి నిర్మిస్తున్న పద్మావతి సినిమాలో ఐశ్వర్యరాయ్‌ అతిథి పాత్రలో దీపికా పదుకొణేతో కలిసి ఒక పాటలో దర్శనమివ్వబోతుందని తెలిసింది. షారుఖ్‌తో కలిసి ఐశ్వర్య శక్తి, దేవదాస్‌, హమ్‌ తుమ్హారేహై సనమ్‌, మొహబ్బతేన్‌, జోష్‌ అనే ఐదు సినిమాల్లో నటించింది.