విప్లవాత్మక మార్పులకు జీహెచ్‌ఎంసీ శ్రీకారం!  

సరికొత్త కార్యక్రమాలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు సిద్ధమవుతోంది జీహెచ్ఎంసీ యంత్రాంగం. విప్లవాత్మక మార్పుల‌తో ముందుకు రావ‌డానికి సమాయత్తమ‌వుతోంది.స్వచ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్ఎంసీ…మెరుగైన ర్యాంకు కోసం ప్రయ‌త్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా కార్పొరేట్ సంస్థల‌ను భాగ‌స్వాముల‌ను చేసేందుకు రంగం సిద్ధం చేసింది. స్వచ్ఛ భార‌త్ స్ఫూర్తిగా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో నిర్వహిస్తున్న స్వచ్ఛ కార్యక్రమంలో భాగ‌స్వాములు కావ‌డానికి ప‌లు ప్రముఖ కంపెనీలు, సంస్థలు జీహెచ్ఎంసీకి పెద్ద ఎత్తున ఆర్థిక స‌హాయాన్ని అంద‌జేస్తున్నాయి. కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బులిటీ కింద జీహెచ్ఎంసీకి భారీ ఎత్తున నిధులు అందిస్తున్నాయి.

ఇటీవ‌లే ఎల్‌బీ స్టేడియంలో జ‌రిగిన స్వచ్ఛ్ స‌ర్వేక్ష‌ణ్  అవ‌గాహణ కార్యక్రమంలో ట్రీగార్డ్ ల ఏర్పాటు కోసం రాంకీ సంస్థ రెండు కోట్ల రూపాయ‌లు, కామినేని సంస్థ కోటి రూపాయ‌లు, ఆంధ్రాబ్యాంకు 25 ల‌క్షల రూపాయ‌ల  చెక్కుల‌ను అంద‌జేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్ మొద‌టి ద‌శ‌లో మూడు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీకారం తెలుప‌గా…. కిమ్స్ హాస్పిట‌ల్ రెండు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు అంగీకరించింది. ఇక హ‌డ్కో సంస్థ రూ. 1.10 కోట్లు ఇచ్చేందుకు, ఎన్‌.ఎం.డి.సి ఐదు ఈ-టాయిలెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఐటీసీ సంస్థ వంద కేంద్రాల ద్వారా డ్రై వేస్ట్ సెంట‌ర్ల ఏర్పాటు, గోద్రేజ్ సంస్థ ప‌ది కేంద్రాల ద్వారా డ్రైవేస్ట్ సెంటర్ల ఏర్పాటు, ఎన్‌.టి.పి.సి సంస్థ ఐదు స్వచ్ఛ ఆటో టిప్పర్లను ఉచితంగా అందించ‌డానికి అంగీకారం తెలిపాయి. మ‌రికొన్ని కార్పొరేట్ సంస్థలు వ‌స్తు రూపేణా స‌హాయాన్ని అంద‌జేయ‌డానికి ముందుకొస్తున్నాయి.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహ‌ణ‌పై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధచూపుతోంది. చెత్తను సేక‌రిస్తున్న స్వచ్ఛ ఆటో రిక్షాలు, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే కార్మికులను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా బహిరంగంగా చెత్తను వేయకుండా ప్రతిరోజు స్వచ్ఛ ఆటోల‌కు చెత్తను అందించే మ‌హిళ‌ల‌కు ప్రోత్సాహ‌క‌ బ‌హుమ‌తులు అందించ‌డానికి ప‌లు సంస్థల నుండి స్పాన్సర్లను ఆహ్వానించింది.

విధి నిర్వహ‌ణ‌లో నిబ‌ధ్దతను పాటించే పారిశుధ్య సిబ్బంది, మున్సిప‌ల్ చ‌ట్టాలు, నిబంధ‌న‌లను ఉల్లంఘించని పౌరులను ప్రోత్సహించే చ‌ర్యల్లో భాగంగా బ‌హుమ‌తులను అంద‌జేయాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ జ‌నార్దన్‌రెడ్డి నిర్ణయించారు. న‌గ‌దు లేదా బంగారం రూపంలో అందించే బ‌హుమ‌తులను వ్యాపార, కార్పొరేట్‌, ప్రైవేట్‌, స్వచ్ఛంద సంస్థలచే జీహెచ్ఎంసీ అందించ‌నున్నది. మ‌హిళ‌ల‌కు ఇస్తున్న ప్రోత్సాహ‌కాల మాదిరిగానే  స్వచ్ఛ కార్యక్రమాల‌ను స‌మ‌ర్థవంతంగా చేప‌ట్టే వారికి కూడా  స‌ర్కిళ్లు, వార్డుల వారిగా బ‌హుమ‌తుల‌ను అంద‌జేయాల‌ని నిర్ణయించింది.

దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత మరింత వేగంగా నగదు రహిత సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున స్వైపింగ్ యంత్రాలను సమకూర్చుకుంటోంది.నగదు రహిత పన్ను చెల్లింపులను ప్రోత్సహించేందుకు బహుమతులను అందించిన జీహెచ్ఎంసీ… నీతి ఆయోగ్ ను సైతం ఆకర్షించింది. ఈ చెల్లింపుల్లో దేశంలోనే  ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని కార్పొరేషన్లలోనూ ముందు భాగాన నిలిచింది. దీంతో … మరింత విస్తృతంగా నగదు రహిత సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. బల్దియా నిర్వహిస్తున్న 19 సిటీజన్ సర్వీస్ కేంద్రాల్లోనూ స్వైపింగ్ యంత్రాలను ప్రవేశపెడుతున్నారు. డెబిట్ , క్రెడిట్ కార్డుల ద్వారా బల్దియాకు పన్నులు చెల్లించే పౌరులు ఈ విధానం ద్వారా నగదు రహిత సేవలు వినియోగించుకోవచ్చు. గ్రేటర్ పరిధిలో పనిచేస్తున్న350 మంది బిల్ కలెక్టర్లకు కూడా స్వైపింగ్ యంత్రాలు సమకూర్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది.

వీటితోపాటు న‌గ‌రంలోని ప్రముఖ ప‌ర్యాట‌క స్థలాలు,ప్రధాన వ్యాపార కూడ‌ళ్లలో అత్యంత ఆధునిక ఈ-టాయి లెట్లను ఏర్పాటు చేయాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మొద‌టి ద‌శ‌లో ఈ-టాయిలెట్లను 15 ప్రాంతాల్లో జ‌న‌వ‌రి 26వ తేదీలోగా ఏర్పాటు చేయ‌డానికి చ‌ర్య‌లు ప్రారంభించింది. ఈ-టాయిలెట్లను కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా ఏర్పాటు చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంత‌న్ ముఖ‌ర్జి, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ ప్రతినిధుల‌తో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ప్రత్యేకంగా స‌మావేశమ‌య్యారు. సీఎస్ఆర్‌లో భాగంగా ఈ-టాయిలెట్లను ఏర్పాటు చేయ‌డానికి ఎస్‌.బి.హెచ్ ఎండి సూత్రప్రాయంగా అంగీక‌రించారు. ఈ ఈ-టాయిలెట్లకు టెండ‌ర్ ప్రక్రియ‌ను కూడా జీహెచ్ఎంసీ పూర్తిచేసింది.

ఇక న‌గ‌రంలో ఫుట్‌పాత్‌ల‌ను ఆక్రమించే వ్యాపార‌స్తుల ప‌ట్ల క‌ఠినంగా వ్యవ‌హ‌రించాల‌ని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫుట్‌పాత్‌ల‌ ఆక్రమ‌ణ‌ల‌ను మ‌రింత ప‌క‌డ్బందీగా తొల‌గించేందుకు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్దన్‌రెడ్డి, హైద‌రాబాద్ న‌గ‌ర ట్రాఫిక్ అధికారుల‌తో ప్రత్యేక స‌మావేశం నిర్వహించారు. ఫుట్‌ పాత్‌ల‌పై షెడ్‌లు, సామాన్లు పెట్టి వ్యాపారం చేసే వారిని గుర్తించి జ‌రిమానాలు విధిస్తున్నామని ,వారం రోజుల తర్వాత ఛార్జ్ షీట్ కూడా దాఖ‌లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు  జ‌నార్దన్ రెడ్డి తెలిపారు. న‌గ‌రంలో స్ట్రీట్ వెండ‌ర్స్ పాల‌సీ అమ‌లులో ఉన్నందున చిరు వ్యాపారులపై చ‌ర్యలు చేప‌ట్టడంలేద‌న్నారు. జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్‌, ఏఎంహెచ్ఓలు ట్రాఫిక్ పోలీసుల‌తో క‌లిసి ఈ ఫుట్‌పాత్‌ల ఆక్రమ‌ణ‌ల‌ను తొల‌గించే ప్రక్రియ‌ను ముమ్మరంగా చేప‌ట్టనున్నామన్నారు.

సరికొత్త కార్యక్రమాలతోపాటు ఖాదీ ప‌రిశ్రమ‌ను ప్రోత్సహించేలా ప్రతి సోమ‌వారం జీహెచ్ఎంసీలోని ప్రతి అధికారి కాట‌న్ దుస్తుల‌ను ధ‌రించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్. తాము చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రజ‌లు కూడా సహకరించాలని  విజ్ఞప్తి చేస్తున్నారు.