వచ్చే నెల 15 లోపు టెక్స్ టైల్ పార్కుకు శంకుస్థాపన

వరంగల్ లో మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఫిబ్రవరి 15వ తేదీలోపు ముఖ్యమంత్రి కేసీఆర్ తో శంకుస్థాపన చేయించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ పార్క్ పనులు రోజువారీగా పర్యవేక్షించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్ గా కమిటీ వేస్తున్నామని చెప్పారు. టెక్స్ టైల్ పార్క్ ప్రతిపాదిత స్థలాన్ని ఎమ్మెల్యే ధర్మారెడ్డి, జిల్లా స్థానిక అధికారులతో కలిసి డిప్యూటీ సీఎం పరిశీలించారు.

1200 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ మెగా టెక్స్ టైల్ పార్కులో దూది తయారు నుంచి ఫైనల్ డ్రెస్ బయటకు వచ్చే వరకు అన్ని యూనిట్స్ ఇందులో ఉంటాయన్నారు కడియం శ్రీహరి. దేశంలోనే అద్భుత పార్క్ అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు. ఈ పార్కు వల్ల 1,13,000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. దాదాపు 11,586 కోట్ల రూపాయల అంచనాలతో పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. 1200 ఎకరాలలో ఇప్పటికే 1000 ఎకరాలు సేకరించారని చెప్పారు.

ఈ పార్క్ ఇక్కడకు తీసుకురావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే ధర్మారెడ్డి, వరంగల్ రూరల్ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ ను డిప్యూటీ సీఎం కడియం అభినందించారు. పార్క్ ఏర్పాటులో అధికారులు చేసిన ప్లాట్ లో కొన్ని మార్పులు సూచించారు. వీరు సూచించిన మార్పులు బాగా ఉన్నాయని, వాటిని అమలు చేసే విధంగా ప్లాన్ మారుస్తామని టిఎస్ఐఐసి ఎండీ నరసింహరెడ్డి తెలిపారు.