రాష్ట్రమంతా చేనేతల సందడి

మంత్రి కేటీఆర్ కార్యాలయంలో సందడి నెలకొన్నది. ప్రతీ ఒక్కరు పంచెకట్టుతో వచ్చి హ్యాండ్లూమ్ మండేను గ్రాండ్  సక్సెస్ చేశారు. మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాలతో కార్యాలయానికి వచ్చారు. ఆఫీసులో అటెండర్ నుంచి ఆఫీసర్  వరకు ప్రతీ ఒక్కరు చేనేత వస్త్రాలతోనే దర్శనమిచ్చారు.

చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు తానే స్వయంగా బ్రాండ్  అంబాసిడర్ గా ఉంటానని మంత్రి కేటీఆర్ ఇదివరకే స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఖచ్చితంగా చేనేత వస్ర్తాలను ధరించనున్నట్లు తెలిపారు. తనతో పాటు ప్రతీ శాఖలోని ఉద్యోగులు చేనేత వస్ర్తాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ విజ్ఞప్తికి స్పందించిన ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించి ఆఫీసుకు వచ్చారు. తెలంగాణ చేనేత శాఖ టెస్కో ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సంస్ధ ఆన్ లైన్ ఆర్డర్లు స్వీకరించే వెబ్ సైట్ ను ఆధునికీకరిస్తామన్నారు. చేనేత అమ్మకాల కేంద్రాలను మరిన్ని పెంచనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చేనేత డైరెక్టర్ శైలజా రామయ్యర్ కు ఆదేశాలు జారీ చేశారు.

చేనేత వస్ర్తాలను ధరించి కార్యాలయాలకు వచ్చిన ఐటి, మున్సిపల్, చేనేత, టెక్స్ టైల్, పరిశ్రమల శాఖల ఉద్యోగులు మంత్రిని కలిశారు. జీహెచ్ఎంసీ అధికారులు గ్రీవెన్స్ డే రోజు చేనేత వస్ర్తాలు ధరించి, ప్రజల్లో చేనేతల పట్ల చైతన్యం కలిగించాలని మంత్రి కోరారు. మంత్రి సూచనలతో ఇప్పటికే పలు జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులు మండే హ్యాండ్లూమ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ వారందరికీ అభినందనలు తెలియజేశారు.