రష్యా చేతిలో ట్రంప్‌ సీక్రెట్స్!

ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు నిఘా సంస్థలు అందజేసిన ఇంటలిజెన్స్‌ నివేదిక దుమారం రేపుతోంది. రష్యా ఇంటలిజెన్స్‌ సర్వీస్‌ చేతిలో ట్రంప్‌కు సంబంధించి కీలకమైన, వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు రిపోర్టు స్పష్టం చేస్తోంది. కానీ దీనికి సంబంధించి స్పష్టమైన ఆధారాలులేవని అంటున్నాయి. అయితే ఈ సమాచారాన్ని అత్యంత విశ్వసనీయ వర్గాలే అందజేసినట్లు రిపోర్టులో స్పష్టం చేశాయి. ఈ వివరాల ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేయవచ్చని ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు అంటున్నాయి. అయితే ట్రంప్‌ మాత్రం వీటిని కొట్టి పారేస్తున్నారు. ఇవన్నీ కల్పిత వార్తలని, ఏజెన్సీలు అనవసర రాజకీయం చేస్తున్నాయని ట్విట్టర్‌ లో ట్వీట్‌ చేశారు. ట్రంప్‌  ట్వీట్ల పై స్పందించిన ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు తాము రిపోర్టులో చెప్పింది చాలా తక్కువని.. తమ వద్ద ఇంకా సమాచారం ఉందని అంటున్నాయి. రష్యా ఇంటలిజెన్స్‌ వర్గాలు ఇద్దరు నాయకులకు సంబంధించి దారుణమైన సమాచారాన్ని సేకరించాయని, డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిని దెబ్బతీసే ఉద్దేశంతోనే హ్యాకింగ్‌ చేశారని చెబుతున్నాయి. ట్రంప్‌ను గెలిపించాలనే లక్ష్యంతోనే రష్యా నిఘా సంస్థలు ఈ పని చేశాయని స్పష్టం చేశాయి.

ఇదిలా ఉంటే డొనాల్డ్‌  ట్రంప్‌ కు సంబంధించిన ఓ వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 2013లో ట్రంప్‌ రష్యా రాజధాని మాస్కో వెళ్లినప్పుడు ఓ లగ్జరీ హోటల్‌ లో బస చేశారని, ఆ సమయంలో కొంతమంది వేశ్యలతో గడిపారని యూఎస్‌ న్యూస్‌ పేపర్లు ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ట్రంప్‌ వేశ్యలతో గడిపిన వీడియోలు ప్రస్తుతం రష్యా చేతిలో ఉన్నాయని, అవి అగ్రరాజ్య ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశముందని అంటున్నాయి. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని ప్రెసిడెంట్‌ అయిన తర్వాత ట్రంప్‌ను రష్యా బ్లాక్‌ మెయిల్‌ చేసే ఛాన్సుందని చెబుతున్నాయి. వీడియోల విషయం తెలిసే రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ట్రంప్‌ ప్రేమ కురిపిస్తున్నారన్నది వార్తా కథనాల సారాంశం.