మా అనుమతితోనే పెద్ద నోట్ల రద్దు

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి తమ ఆమోదం ఉందని ఆర్బీఐ ప్రకటించింది. హఠాత్తుగా ప్రకటించిన ఈ డెసిషన్‌ కు ఆర్.బి.ఐ అనుమతి లేదన్న ఆరోపణలు రావటంతో ఆర్బీఐ తొలిసారి వివరణ ఇచ్చింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించినప్పటికీ సెంట్రల్‌ బ్యాంక్‌ అనుమతి తీసుకున్నారని ఆర్బీఐ తేల్చిచెప్పింది. పార్లమెంటరీ కమిటీకి ఈ అంశంపై ఇచ్చిన నివేదికలో పూర్తి వివరాలను సమర్పించింది. గతేడాది నవంబర్‌ 7న పెద్ద నోట్లను రద్దు చేయాలని కేంద్రం తమకు సూచించినట్లు ఆర్బీఐ తెలిపింది. నకిలీ నోట్ల చెలామణిని అడ్డుకునేందుకు, తీవ్రవాదుల ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు, బ్లాక్‌ మనీ నివారణకు పెద్ద నోట్ల రద్దే సరైన చర్య అని కేంద్రం తమకు సూచించినట్లు నివేదికలో ఆర్బీఐ పేర్కొంది.

కేంద్రం విజ్ఞప్తికి ఆర్బీఐ వెంటనే ఓకే చెప్పింది. కేంద్రం చెప్పిన కారణాలు దేశ భద్రత అంశానికి ముడిపడి ఉండటంతో వెంటనే చర్చించి ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్లు ఆర్బీఐ  తెలిపింది. డిసెంబర్‌ 22 నే పార్లమెంటరీ ఆర్థిక వ్యవహారాల కమిటీకి ఇచ్చిన నివేదికలో ఈ అంశాలను సెంట్రల్‌ బ్యాంక్ పేర్కొంది. దీంతో పెద్ద నోట్ల రద్దుకు ఆర్బీఐ అనుమతి లేదన్న వాదనలు తప్పని తేలిపోయాయి.

2 వేల నోట్లు ప్రవేశ పెట్టే విషయంలోనూ సెంట్రల్ బ్యాంకు బోర్డు గతేడాది మే లోనే ఆమోదం తెలిపింది. ఐతే, ఈ సమావేశంలో మాత్రం పెద్ద నోట్ల రద్దు అంశం చర్చకు రాలేదు. రఘురాం రాజన్‌ ఆర్బీఐ గవర్నర్‌ గా ఉన్న సమయంలోనే 2 వేల నోటు విడుదల చేసేందుకు అనుమతి వచ్చింది. పెద్ద నోట్ల రద్దుకు 2 వేల రూపాయల నోట్ల ముద్రణకు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్‌ తెలిపింది.

ఐతే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఒక వ్యక్తి చేసిన తుగ్లక్ ఆదేశమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ కమిటీకి ఆర్బీఐ ఇచ్చిన వివరణ ఈ విషయాన్ని తెలియజేస్తోందన్నారు.