బ్లైండ్ స్కేటింగ్ లో సత్తా చాటిన చిన్నారి

ఈ చిన్నారి పేరు శిక్షా సాగర్ షా. తొమ్మిదేళ్ల వయసులోనే అద్భుతాలు చేసింది. బ్లైండ్ స్కేటింగ్ లో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. అతి చిన్న వయసులోనే ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. ఖైరతాబాద్ నాసర్ స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్న శిక్షాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందునా స్కేటింగ్ అంటే ప్రాణం. చిన్న వయసులోనే స్కేటింగ్ మీద మక్కువ ఏర్పడింది. కూతురు ఇష్టాన్ని గమనించిన తల్లిదండ్రులు.. శిక్షాకు ట్రైనింగ్ ఇప్పించారు. రొటీన్ స్కేటింగ్ లో పెద్దగా గుర్తింపు ఉండదు. అందుకే శిక్షా బ్లైండ్ స్కేటింగ్ ను ఎంచుకుంది. అంటే కళ్లకు గంతలు కట్టకొని స్కేటింగ్ చేయడం. కొంచెం కష్టమే. తేడా వస్తే ప్రమాదం కూడా! కానీ పేరెంట్స్ సాయంతో శిక్షా బ్లైండ్ స్కేటింగ్ ను ఈజీగా నేర్చుకుంది.

బ్లైండ్ స్కేటింగ్ అందరికీ అయ్యే పని కాదు. కానీ శిక్షా తన ప్రతిభతో ఔరా అనిపిస్తోంది. కళ్లకు గంతలు కట్టుకుని సునాయాసంగా స్కేటింగ్ చేస్తోంది. ఇందులో కొన్ని మెలకువలు కూడా నేర్చుకుంది. బ్లైండ్ ఫోల్డెడ్ స్కేటింగ్ విత్ హూలాహుప్ లో శిక్షాకు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం లభించింది. ఇప్పటికే ఈ చిచ్చరపిడుగు నాసర్ స్కూల్ తరపున స్టార్ అవార్డులు కూడా అందుకుంది. ఆ చిన్నారి ప్రతిభకు గుర్తింపుగా అనేక మెడల్స్ లభించాయి. ఇంత చిన్న వయసులో శిక్షా సాధిస్తున్న విజయాల వెనక కచ్చితంగా ఆమె తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంది.

 

శిక్షా అక్క సాక్షి కూడా క్రీడాకారిణే. స్కేటింగ్ లో ఆమె నేషనల్ ప్లేయర్. అక్కను చూసే స్కేటింగ్ నేర్చుకున్నానంటోంది శిక్షా. అక్కే తనకు ఇన్ స్పిరేషన్ అంటోంది. పేరెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహంతోపాటు కోచ్ అందించిన శిక్షణే తనకు విజయాలకు కారణమంటోంది శిక్షా షా. అటు సాక్షి కూడా చెల్లి సాధించిన ఘనతను చూసి మురిసిపోతోంది.గిన్నిస్ బుక్ రికార్డును తన తర్వాతి టార్గెట్ గా పెట్టుకుంది శిక్షా. పీవీ సింధూలా తనని కూడా పెద్ద పెద్ద హోర్డింగుల్లో చూసుకోవాలని ఆశపడుతోంది. చిన్న వయసులోనే పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్న ఈ చిన్నారి- జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.