ఫేర్‌ వెల్‌ స్పీచ్‌లో ఒబామా ఉద్వేగం

ఎనిమిదేళ్లు… ఎన్నో విజయాలు… మరెన్నో సవాళ్లు. అన్నింటినీ అధిగమించాడు. అగ్రరాజ్య వైభవాన్ని కొనసాగించాడు. నమ్మకం, నిబద్ధత అనే సిద్ధాంతాలు నమ్మి ఆర్థికంగా అథపాతాళానికి చేరిన అమెరికా ప్రతిష్ఠ మళ్లీ ఆకాశాన్ని తాకేలా చేశాడు. 2008లో అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన బరాక్‌ ఒబామా లక్ష్యం ఒక్కటే. అదే ప్రజా శ్రేయస్సు. తనపై నమ్మకముంచి అధికారం కట్టబెట్టిన అమెరికన్లను కన్నబిడ్డల్లా చూసుకున్న ఒబామా.. అధ్యక్ష హోదా నుంచి తప్పుకోక తప్పని పరిస్థితి. అందుకే చికాగో వేదికగా ఇచ్చిన ఫేర్‌ వెల్‌ స్పీచ్‌లో ఆయన ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

1961 ఆగస్టు 4న హవాయిలోని హోనోలులులో జన్మించారు బరాక్‌ ఒబామా. తల్లి స్టాన్లీ ఎన్‌డన్హమ్‌. తండ్రి బరాక్‌ ఒబామా సీనియర్‌. హవాయిలో పుట్టి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తొలి ఆఫ్రో అమెరికన్‌ ఒబామా. ఆయన రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. పదేళ్ల వయసు వచ్చే వరకు ఒబామా జకార్తాలోని బెసుకీ పబ్లిక్‌ స్కూల్‌, సెయింట్‌ ఫ్రాన్సిస్‌ ఆఫ్‌ అసిసీ స్కూల్‌లో చదువుకున్నాడు. 1971లో హోనోలులులోని అమ్మమ్మ తాత దగ్గరకు తిరిగొచ్చిన ఆయన అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1979లో లాస్‌ ఏంజెల్స్‌ లోని ఓసిడెంటల్‌ కాలేజ్‌ లో చేరిన ఆయన రెండేళ్ల తర్వాత న్యూయార్క్‌ సిటీలోని కొలంబియా యూనివర్సిటీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యారు. అక్కడ పొలిటికల్‌  సైన్స్‌లో ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌లో స్పెషిలైజేషన్‌ చేశారు. బిజినెస్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేషన్‌, న్యూయార్క్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ రీసెర్చ్‌ గ్రూప్‌లో పనిచేసిన యన 1988లో హార్వర్డ్‌ లా స్కూల్‌లో చేరాడు. 1991లో లా గ్రాడ్యుయేషన్‌ కంప్లీట్‌ చేసుకుని చికాగో తిరిగి వచ్చారు. 1995లో డ్రీమ్స్‌ ఫ్రం మై ఫాదర్‌ అనే పేరుతో ఓ పుస్తకాన్ని ప్రచురించారు ఒబామా. ఆ తర్వాత 12 ఏళ్ల పాటు చికాగో యూనివర్సిటీ లా కాలేజ్‌లో అధ్యాపకుడిగా పనిచేశారు. 1992 నుంచి 96 వరకు లెక్చరర్‌గా, 1996 నుంచి 2004 వరకు సీనియర్‌ లెక్చరర్‌గా కాన్‌స్టిట్యూషనల్‌ లా బోధించారు.

1996లో ఒబామా ఇల్లినాయిస్‌ సెనేట్‌ కు ఎన్నికయ్యారు. ఇల్లినాయిస్‌ 13 డిస్ట్రిక్ట్‌ నుంచి సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. సెనేట్‌లో అడుగుపెట్టాక ఆరోగ్య సంరక్షణ చట్టాల్లో సంస్కరణలకు సంబంధించిన చట్టానికి ఒబామా రెండు పార్టీల మద్దతు పొందారు. తక్కువ ఆదాయం గల కార్మికులకు పన్ను తగ్గించే చట్టానికి ప్రాతినిథ్యం వహించడంతో పాటు, సంక్షేమం, సంస్కరణలపై చర్చలు, శిశు సంరక్షణకు సబ్సిడీలను పెంచడాన్ని ప్రోత్సహించారు. 1998లో ఇల్లినాయిస్‌ను సెనేట్‌కు ఎన్నికైన ఒబామా.. 2002లోనూ మరోసారి విజయం సాధించారు. 2004లో ఆయన ఇల్లినాయిస్‌ సెనేటర్‌గా రాజీనామా చేశారు. అదే ఏడాది మాసాచుసెట్స్‌ లో జరిగిన డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో ఆయన చేసిన కీలకోపన్యాసం ప్రజల్లోకి చొచ్చుకెళ్లింది. దీంతో డెమొక్రాటిక్‌ పార్టీలో ఆయన స్థానం సుస్థిరమైంది. 2004 నవంబర్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఒబామా 70శాతం ఓట్లతో విజయం సాధించారు. 2005 జనవరి 4న సెనేటర్‌గా పదవీ ప్రమాణం చేశారు. అప్పట్లో కాంగ్రెస్‌ బ్లాక్‌ కాకస్‌ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క సెనేటర్‌ ఒబామానే కావడం విశేషం. 2007 ఫిబ్రవరి 10న ఇల్లినాయిస్‌లోని స్ప్రింగ్‌ ఫీల్డ్‌ లోని స్టేట్‌ క్యాపిటల్‌ బిల్డింగ్‌ ముందు ఒబామా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. 1858లో అబ్రహం లింకన్‌ కూడా ఇదే వేదికపై చారిత్రాత్మక  ప్రసంగం చేశారు.

డెమొక్రాటిక్‌ పార్టీ ప్రైమరీల్లో ఒబామా ఎంతో మందితో పోటీ పడాల్సి వచ్చింది. బరాక్‌ – సెనేటర్‌ హిల్లరీ క్లింటన్‌  మధ్య అసలు పోరు జరిగింది.  నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ పోరులో చివరకు హిల్లరీని ఓడించిన ఆయన.. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ నామినీ జాన్‌ మెక్‌కెయిన్‌తో పోటీ పడ్డారు. ప్రైమరీలు, ప్రెసిడెన్షియల్‌ ఎలక్షన్ల సందర్భంగా ఒబామా ప్రచారం, నిధుల సేకరణ విషయంలో అనేక రికార్డులు సృష్టించారు. అయితే 2008 జూన్‌ 19న ఒబామా ప్రభుత్వ నిధుల సాయాన్ని తిరస్కరించారు. 1976లో ఈ పద్దతి ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వసాయాన్ని తిరస్కరించిన తొలి ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఒబామా గుర్తింపుపొందారు. ఎన్నికల్లో 365 ఎలక్టోరల్‌ ఓట్లు గెల్చుకుని అధ్యక్ష పోటీలో విజయం సాధించిన తొలి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా నిలిచారు.

2009 జనవరి 20న 44వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బరాక్‌ ఒబామా తన పనితీరుతో ప్రజల మనసు గెల్చుకున్నారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన అమెరికాను గట్టెక్కించిన ఘనత ఈయన సొంతం. 2009 అక్టోబర్‌ 9 నార్వే నోబెల్‌ కమిటీ ఒబామాకు నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటించింది. ప్రజల మధ్య సహకారాన్ని అంతర్జాతీయ దౌత్యాన్ని పటిష్ఠపరిచేందుకు ఆయన చేస్తున్న అసాధారణ కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం దక్కింది. 2012లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బరాక్‌ ఒబామా ఎన్నికల హామీలు నిలబెట్టుకున్నారు. బీమా పరిధిలోలేని వారి కోసం ఎఫర్డబుల్‌  కేర్‌ యాక్ట్‌ అమల్లోకి తెచ్చారు. తన పనితీరుతో అందరి మన్ననలు అందుకున్న ఆయన ప్రజల మనసుల్లో స్థానం సుస్థిరం చేసుకున్నారు. అందుకే అవకాశం ఉంటే మూడోసారి ఒబామా అధ్యక్షుడు కావాలని జనం కోరుకున్నారు.

ఎనిమిదేళ్లలో ఎన్నో అనుభవాలు. మరెన్నో విజయాలు. ప్రజా సంక్షేమం కోసం వైట్‌హౌస్‌లో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఆయన.. ట్రంప్‌ ఎన్నికతో ప్రజలకు వీడ్కోలు చెప్పక తప్పలేదు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలి ప్రసంగం చేసిన చికాగోనే ఆయన వీడ్కోలు సందేశమిచ్చారు. ప్రజల వల్లే తాను మంచి అధ్యక్షుడిగా మంచి మనిషిగా పేరు తెచ్చుకున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రజాభిమానాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వెంటనే నవ్వుతూ అవకాశముంటే తనకు మరో నాలుగేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగాలని ఉందంటూ సరదాగా మాట్లాడారు.

మార్పు, ఆశావాదం ఈ నినాదంతోనే అమెరికా అధ్యక్షుడిగా ఒబామా 2008లో ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆర్థిక సమానత్వం, జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు. సామాన్య ప్రజలు స్పందించినప్పుడే మార్పు సాధ్యమని అమెరికాను భయపెట్టేవారిని వదిలిపెట్టమని ఉగ్రమూకలకు వార్నింగ్‌ ఇచ్చారు. ట్విన్‌ టవర్స్‌ పై దాడి చేసిన లాడెన్‌ సహా ఎంతో మంది తీవ్రవాదులను హతమార్చిన ఒబామా పదవీకాలంలో ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు.

అధ్యక్షుడిగా తీరిక లేని పనులున్నా కుటుంబానికి సమయం కేటాయించారు బరాక్‌ ఒబామా. అందుకే చివరి ప్రసంగంలో వారి గురించి ప్రస్తావించారు. మంచి భార్యగా, తల్లిగానే కాకుండా బెస్ట్‌ ఫ్రెండ్‌గా మిషెల్లీ తనకు అన్నివేళలా అండగా ఉందని చెప్పారు. ఇక తనను డెమొక్రాటిక్‌ పార్టీ ప్రెసిడెన్షియల్‌ నామినీగా తొలిసారి ప్రతిపాదించిన జో బిడెన్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

దేశ యువత, కృషి, వైవిధ్యం, పారదర్శకత, తెగింపు, పునర్‌ సృష్టిస్తే భవిష్యత్తు మనదేనన్నది ఒబామా మాట. జాతి వివక్షను పారదోలేందుకు మరింత బలమైన చట్టాలు రావాలని, రాజ్యాంగం, ఆదర్శాలు అందులో ప్రతిబింబించాలన్న ఆయన ఆకాంక్ష నిజంకావాలని కోరుకుందాం.