పెట్రోల్ బంకుల్లో కార్డులు బంద్

నగదు రహిత లావాదేవీలు జరపాలని పరోక్షంగా ఒత్తిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఆ పేరుతో మరింత దోపిడీకి తెర తీస్తోంది. ఇప్పటికే పెద్ద నోట్ల రద్దుతో నానా ఇబ్బందులు ప‌డుతున్న దేశ ప్రజ‌ల‌కు మ‌రో షాక్ ఇవ్వడానికి పెట్రోల్ బంకులు సిద్ధమయ్యాయి. దేశ‌వ్యాప్తంగా సోమ‌వారం నుంచి పెట్రోల్ బంకుల్లో డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను అంగీక‌రించ‌కూడ‌ద‌ని పెట్రోలియం ట్రేడ‌ర్స్ అసోసియేష‌న్ నిర్ణయించింది. కార్డు ద్వారా జ‌రిపే ప్రతి లావాదేవీపై బ్యాంకులు ఒక శాతం చార్జీ వ‌సూలు చేయాల‌ని నిర్ణయించ‌డ‌మే దీనికి కార‌ణం. ఇది హ‌ఠాత్తుగా తీసుకున్న అక్రమ నిర్ణయ‌మ‌ని పెట్రోల్ బంకుల య‌జ‌మానులు మండిప‌డుతున్నారు. బ్యాంకులు విధించాల‌నుకున్న ఈ కొత్త చార్జీలు వినియోగ‌దారుల‌ నుంచి వసూలు చేయడం లేదు. దీంతో అదంతా త‌మ‌పై ప‌డుతుంద‌ని పెట్రోల్ బంకుల యాజ‌మాన్యాలు ఆందోళ‌న చెందుతున్నాయి.

బ్యాంకుల నిర్ణయానికి నిర‌స‌న‌గా సోమ‌వారం నుంచి కార్డుల‌ను అంగీక‌రించ‌డం లేద‌ని, కేవ‌లం న‌గ‌దునే అంగీక‌రిస్తామ‌ని క‌ర్ణాట‌క ఫెడ‌రేష‌న్ ఆఫ్ పెట్రోలియ‌ం అధ్యక్షుడు బీఆర్ ర‌వీంద్రనాథ్ స్పష్టం చేశారు. ఇది ల‌క్షలాది మంది వినియోగ‌దారుల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగించే నిర్ణయ‌మే. అస‌లే న‌గ‌దు కొర‌త వ‌ల్ల స‌త‌మ‌త‌మ‌వుతుండ‌టంతోపాటు కార్డుల ద్వారా పెట్రోల్ పోయించుకుంటే 0.75 శాతం క్యాష్‌బ్యాక్ అన్న ప్రభుత్వ ఆఫ‌ర్‌ తో ఇప్పుడిప్పుడే ప్రజ‌లు భారీగా కార్డుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పెట్రోల్ బంకులు వాటిని అంగీక‌రించ‌కుంటే మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్పవు. దీనిపై రవీంద్రనాథ్ స్పందిస్తూ.. బ్యాంకులే దీనికి కార‌ణ‌మ‌ని, వాళ్లు ప్రజ‌ల‌కు క్షమాప‌ణ చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) త‌మ నెట్ ప్రాఫిట్‌ ను 0.3 శాతం నుంచి 0.5 శాతంగా నిర్ణయించాయ‌ని, ఇలాంటి ప‌రిస్థితుల్లో బ్యాంకులు ఒక శాతం చార్జీ విధిస్తే మా ప‌రిస్థితి ఏంటి అని ర‌వీంద్రనాథ్ ప్రశ్నించారు. ఈ స‌మ‌స్య ప‌రిష్కరించాల్సిన ఓఎంసీలు త‌మ‌కు సంబంధం లేద‌న్నట్లు వ్యవ‌హ‌రిస్తున్నాయ‌ని, అందుకే కార్డులు తీసుకోకూడ‌ద‌ని నిర్ణయించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న అంద‌రు పెట్రోలియం డీల‌ర్లు స‌మ‌ష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నార‌ని, బ్యాంకులు ఈ ఒక శాతం చార్జీని తొల‌గించే వ‌ర‌కు కార్డుల‌ను అంగీక‌రించ‌బోమ‌ని ర‌వీంద్రనాథ్ స్పష్టం చేశారు.