నిర్మాణ రంగాన్ని దెబ్బతీసిన పెద్దనోట్ల రద్దు

పెద్దనోట్ల రద్దు ప్రభావం దేశంలో రియల్ రంగాన్ని కుదిపేసింది. మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరుతో పాటు పుణె, అహ్మదాబాద్‌ నగరాల్లో  రియల్ రంగం కుదేలయిందని  నైట్‌ ఫ్రాంక్‌ సర్వే వెల్లడించింది. గతేడాది అక్టోబర్‌–డిసెంబర్‌ నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్ల అమ్మకాలు 44 శాతం మేర పడిపోయాయని వివరించింది. 2010 తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు పడిపోవటం ఇదే మొదటి సారని రిపోర్టులో పేర్కొంది.

అమ్మకాలు తగ్గడంతో నిర్మాణ సంస్థలకు భారీగా నష్టాలు వచ్చినట్లు సర్వే వెల్లడించింది. అమ్మకాల రూపంలో రావాల్సిన రాబడి తగ్గడంతో రాష్ట్రాలకు స్టాంప్‌ డ్యూటీ రూపేణా 1,200 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు నైట్‌ ఫ్రాంక్‌ సర్వే వివరించింది. 2015 అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్య 8 నగరాల్లో 72 వేల,933 ఇళ్లు విక్రయం కాగా.. ఈ ఏడాదిలో 40, 936 ఇళ్లే అమ్ముడయినట్లు పేర్కొంది. అమ్మకాల్లోనే కాక కొత్త ఇళ్ల ప్రారంభంలోనూ 61 శాతం క్షీణత కనిపించింది.

అయితే నోట్లరద్దు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ పై పెద్దగా  ఎఫెక్ట్ చూపించలేదని సర్వే తేల్చిచెప్పింది. పెద్ద నోట్ల రద్దు తరువాత కూడ హైదరాబాద్ లో 60 శాతం మేర అమ్మకాలు జరిగినట్టు నైట్ ఫ్రాంక్ సర్వే  వెల్లడించింది. నగరానికి భారీగా ఐటి కంపెనీలు తరలి రావడంతో పాటు నూతన కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. దీంతో ఇక్కడి రియల్ ఎస్టేట్ పై నోట్లరద్దు ప్రభావం పెద్దగా  లేదని సర్వే తెలిపింది. ఇందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే కారణమని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సర్వే ప్రతినిధులు తెలిపారు.

మరోవైపు పెద్దనోట్ల రద్దుతో రియల్ జోరు తగ్గిందని చాలా మంది భావిస్తున్నారు. కానీ అందులో నిజం లేదని రియల్టర్లు చెబుతున్నారు.ఇందుకు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా సర్వే ఎగ్జాంపుల్ అని పేర్కొంటున్నారు.