నిరుపేద ఒంటరి మహిళలకు రూ. వెయ్యి పెన్షన్

తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమ కోసం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలంగాణ ప్రజల జీవికను పరిపుష్టం చేసేందుకు ముఖ్యమంత్రి  ప్రయత్నిస్తున్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ ప్రశంసలు పొందుతోంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ మరో పెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు. నిరుపేద ఒంటరి మహిళలకు ప్రతినెలా వెయ్యిరూపాయల జీవన భృతి అందజేస్తామని తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్ లో ఎక్కువభాగం సంక్షేమ రంగానికే కేటాయించామన్నారు సీఎం కేసీఆర్. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఆసరా పేరుతో  పెద్దఎత్తున పెన్షన్లు అందజేస్తున్నామని చెప్పారు. బీడి కార్మికులకు వెయ్యి రూపాయల భృతిని ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశ పెట్టామన్నారు.

అసెంబ్లీ సాక్షిగా మరో మానవీయ నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిరుపేద ఒంటరి మహిళలకు ప్రతినెలా వెయ్యిరూపాయల జీవన భృతి అందజేస్తామని ప్రకటించారు. వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మార్చ్ లో ప్రవేశ పెట్టే బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ స్కీం అమలులోకి వస్తుందన్నారు. అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్.

నిరుపేద ఒంటరి మహిళలకు ప్రతినెలా భృతిని ఇవ్వాలన్న నిర్ణయాన్ని శాసనసభ ముక్తకంఠంతో స్వాగతించింది. పార్టీలకతీతంగా శాసనసభ్యులంతా సీఎం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు తెలిపారు.