డబ్బులిచ్చి జైలు జీవితం గడపొచ్చు!

జైలు జీవితం ఎలాగుంటుందో తెలుసుకోవాలనుకునే వారి కోసం రాష్ట్ర జైళ్ల శాఖ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ‘ఫీల్ ద జైల్’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి జైల్ మ్యూజియంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జైలు జీవితం ఎలా ఉందో తెలుసుకోవాలనే వారు 500 చెల్లించి ఒక్కరోజు జైలు జీవితం గడపవచ్చు.

హైదరాబాద్‌ సంస్థానంలో మొదటి సాలార్‌జంగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో 1796లో సంగారెడ్డిలో జైలు నిర్మాణం జరిగింది. జైళ్ల శాఖ రికార్డుల ప్రకారం మొత్తం  తెలంగాణ రాష్ట్రంలోనే  సంగారెడ్డి జిల్లా జైలు అతి పురాతన జైలుగా రికార్డుకెక్కింది. సుమారు 250 యేళ్ల కిత్రం నిర్మించిన ఈ జైలు ఇప్పుడు చారిత్రక వారసత్వ కట్టడం. చరిత్రను కాపాడానికి జైళ్ల శాఖ సరికొత్తగా ప్రణాళికను రూపొందించింది. సంగారెడ్డి శివారులోని కంది సమీపంలో కొత్తగా నిర్మితమైన అధునాతన భవన సముదాయంలోకి జైలు తరలించటంతో ఇప్పుడది మ్యూజియంగా మారింది. పురాతన జైలును నిరుపయోగంగా వదిలివేయకుండా జైలు మ్యూజియంగా మార్చారు. జైలు గోడలపైన, బారాక్ లలో పురాతన కాలం నుండి ఇప్పటి వరకు జైలులో శిక్షలకు సంబంధించిన చిత్రాలను గీశారు. అంతేకాకుండా పురాతన కాలం నుండి వివిధ జైళ్లలో వాడిన పేట్లు, గ్లాసులు, తాళలు ఇతర సామాగ్రిని వివిధ ప్రాంతాల నుండి తెప్పించి మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. ఇలా సంగారెడ్డి జైలు చరిత్రను కాపాడేందుకు ఎక్కడలేని విధంగా మ్యూజియంగా తీర్చిదిద్దారు.

సంగారెడ్డి జైలును మ్యూజియంగా చేయడంతో పాటు ఫిల్ ద జైలు అనే పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా  సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది తెలంగాణ జైళ్ల శాఖ. నేర ప్రవత్తి కల్గి, శిక్షలు అనుభవించడానికి వచ్చే కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచే జైలులో సామన్య ప్రజలు కుడా జైలు జీవితం గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫిల్ ది జైల్ కాన్సెప్ట్‌ లో భాగంగా  జైలు జీవితం ఎలా ఉంటుందన్న ఆసక్తిని అనుభవంగా తెలుసుకొవాలనుకునేవారు 500 చెల్లించి ఒక రోజు అచ్చం ఖైదీలాగా మారిపోవచ్చు. 24 గంటల పాటు ఎలాంటి వసతులు లేకుండా నిజమైన ఖైదీ జీవితం అనుభవించే విధంగా ఫిల్ ద జైలు కొత్త అనుభూతిని ఇస్తుంది. గత సంవత్సరం జూన్‌ 5న మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తోంది. గడచిన ఎనిమిది నెలల్లో 14 మంది ‘ఫిల్ ది జైలు కార్యక్రమంలో భాగంగా జైలులో బందీలుగా మారారు. అంతే కాకుండా సంగారెడ్డి జైలు మ్యూజియంలో వివిధ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు చేసిన చేనేత బట్టలు, సబ్బులు, నూనెలు, పినాయిల్ ల అమ్మకం కోసం ప్రత్యేకంగా  స్టాల్ ను ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు.

సంగారెడ్డి జైలులో ఒక రోజు ఖైదీగా ఉండలనుకునే వాళ్లు జైళ్ల శాఖ నియమ నిబంధలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ జైల్లో గడపాలనుకునేవారికి తల్లిదండ్రులు లేదా కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తప్పనిసరి. వారితో ఫోన్‌లో మాట్లాడించాకే అనుమతిస్తారు. ఆ 24 గంటలు ఫోన్‌ అనుమతి ఉండదు. ఎలాంటి వస్తువులు లోనికి అనుమతించరు. పుస్తకాలు తెచ్చుకోవచ్చు. వచ్చినవారి మానసిక స్థితిని గమనించాకే లోనికి అనుమతి ఇస్తారు. ఒక సారి ఖైదీగా జైలులోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా 24 గంటల పాటు బారక్ లో ఉండాల్సిందే. మధ్యలో వెళ్తమన్న జైలు అధికారులు బయటకు అసలు  పంపించారు. భోజనం మెను కూడా అసలు సిసలు ఖైదీలకు ఇచ్చినట్టే ఉంటుంది. ఉదయం ఆరుగంటలకు బ్యారక్‌ తెరిచి ‘ఖైదీ’ని బయటకు వదులుతారు. కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత కాసేపు యోగా చేయించి గార్డెనింగ్‌ పని అప్పగిస్తారు. 7 గంటలకు  టీ.. తర్వాత ‘విద్యాదానం’పథకంలో భాగంగా చదువు నేర్పిస్తారు. అక్షరాస్యులైతే పుస్తకాలిచ్చి చదువుకోమంటారు. 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌.. తర్వాత కాసేపు స్వేచ్ఛగా విహరించే అవకాశం. 11 గంటలకు మధ్యాహ్న భోజనం. అనంతరం విశ్రాంతి
మధ్యాహ్నం రెండు గంటకు టీ ఇచ్చి.. సాయత్రం 5గంటలకు రాత్రి భోజనం
ఇచ్చి 6 గంటలకు తిరిగి  బ్యారెక్‌లోకి పంపి తాళం వేస్తారు.

సంగారెడ్డి  జైలు మ్యూజియంకు ఇటీవల కాలంలో సందర్శకుల తాకిడి పెరిగింది. దేశంలో ఎక్కడలేని విధంగా జైలు మ్యూజియం ఏర్పాటు అంతేకాకుండా ఫిల్ ది జైల్ పేరుతో చేస్తున్న ప్రోగ్రాం అందిరిని అకట్టుకుంటుంది. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు తమ కేసు స్టడీలో భాగంగా జైలుకు వచ్చి వెళ్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌ అధికారులు జైలును సందర్శించారు. ఇక్కడి పరిస్థితులు అధ్యయనం చేసి ఢాకాలోని పురాతన జైలును కూడా ఇలాగే తీర్చిదిద్దాలని వారు నిర్ణయించుకున్నారు. అలాగే  తీహార్‌ జైలు అధికారులు వచ్చి చూసి వెళ్లారు. వినూత్న అలోచనతో తెలంగాణ జైళ్ల శాఖ తీసుకున్న జైలు మ్యూజియం అలోచన మంచి ప్రయత్నంగా పేరుతెచ్చుకుంటుంది.