జనాలతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు

సంక్రాంతి సంబుంరం సొంతూరులో చేసుకుంటే ఆ మజాయే వేరు. అందుకే పండగకు ముందే పట్నంలో హడావుడి మొదలైంది. విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, రోజూ వారీ కూలీలు, చిరు వ్యాపారులు.. అన్ని వర్గాల జనం పండుగకు సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే సెలవులిచ్చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు జిల్లాలకు క్యూ కట్టారు. దీంతో బస్టాండ్లన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలకు వెళ్లే  ఏ బస్సు కూడా ఖాళీగా లేదు. రూట్లన్నీ బిజీగా ఉన్నాయి. రిజర్వేషన్ చేసుకోకుండా వస్తే సీటు దొరకడం కష్టంగా మారింది.

సంక్రాంతి నేపథ్యంలో సికింద్రాబాద్‌ జూబ్లి బస్ స్టేషన్ కు జనం పోటెత్తారు. కనీసం బస్టాండ్లలో నిల్చునేందుకు కూడా చోటు లేదంటే రద్దీ ఎంతగా ఉందో అర్థమవుతుంది. అటు ఎంజీబీఎస్ లోనూ అదే పరిస్థితి. జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ ముందే రిజర్వ్ అయిపోయాయి. దీంతో కుటుంబాలతో సొంతూరుకు వెళ్లేది ఎలాగో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు.

విద్యార్థులకు సెలవులిస్తేనే పరిస్థితి ఇలాగుంటే.. శని, ఆదివారాల్లో రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు పెద్ద ఎత్తున సొంతూర్లకు తరలివెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జిల్లాలకు బస్సుల సంఖ్యను పెంచారు. ఈసారి పండుగకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య దాదాపు అరకోటి ఉంటుందని  అంచనా. దానికి తగ్గట్టుగానే ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ జనానికి మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం శని, ఆదివారాల్లో అయినా బస్సుల సంఖ్యను మరింత పెంచాలని జనం కోరుతున్నారు.