గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

గణతంత్ర వేడుకలు పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సూచించారు. వేడుకల నిర్వహణ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలపై సచివాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో సీఎస్‌ దిశా నిర్దేశం చేశారు. పలు శాఖల ముఖ్య కార్యదర్శులు, పోలీస్‌ ఉన్నతాధికారులు, మిలిటరీ, అగ్నిమాపక, స్కౌట్స్‌ అండ్  గైడ్స్ విభాగాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనవరి 26న ఉదయం పరేడ్‌ గ్రౌండ్స్‌ లో వేడుకలు మొదలవుతాయని సీఎస్‌ ఎస్పీ సింగ్  తెలిపారు. గవర్నర్‌ నరసింహన్‌  ముఖ్య అతిథిగా పాల్గొంటారని చెప్పారు. వేడుకలకు అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు… ట్రాఫిక్ నియంత్రణకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు మొబైల్‌ టాయిలెట్లు అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ ఎంసీకి సూచించారు. అవసరమైన మేరకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు.

రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, చార్మినార్ లతో పాటు చారిత్రక ప్రాధాన్యమున్న భవనాలను విద్యుత్  దీపాలతో అలంకరించాలని సీఎస్‌ సూచించారు. నిరంతర విద్యుత్‌ తో పాటు మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని విద్యుత్‌, మెట్రో వాటర్‌ వర్క్స్‌ విభాగాలను ఆదేశించారు. వేడుకల ప్రత్యక్ష ప్రసారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమాచార శాఖకు సూచించారు. పరేడ్‌ గ్రౌండ్స్‌ ప్రాంగణాన్ని వినూత్న రీతిలో పుష్పాలతో అలంకరించాలని చెప్పారు. వేడుకలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని, సభా ప్రాంగణంలో అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంచాలని సీఎస్‌  సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వేడుకలు నిర్వహించాలని సీఎస్‌  సూచించారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి రిపబ్లిక్‌  డే సెలబ్రేషన్స్‌ ను విజయవంతం చేయాలని కోరారు.