కోటికి చేరిన భీమ్ డౌన్ లోడ్స్

భార‌త్ ఇంట‌ర్‌ ఫేస్ ఫ‌ర్ మ‌నీ (భీమ్‌) ఈ-వాలెట్ 10 రోజుల్లోనే కోటి డౌన్‌ లోడ్స్‌ ను అందుకుంది. డిసెంబ‌ర్ 30న ఈ యాప్‌ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఆండ్రాయిడ్ యూజ‌ర్స్ కోసం లాంచ్ చేసిన ఈ యాప్‌ ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇప్ప‌టికే కోటి మంది డౌన్‌ లోడ్ చేసుకోవ‌డం విశేషం. 10 రోజుల్లోనే ఈ యాప్‌ కు ఇంత ఆద‌ర‌ణ రావ‌డంపై ప్ర‌ధాని సంతోషం వ్య‌క్తం చేశారు. అవినీతి, న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి టెక్నాల‌జీ ఏ విధంగా సాయ‌ప‌డుతోందో చెప్ప‌డానికి భీమ్ యాపే నిద‌ర్శ‌నం అని మోడీ అన్నారు. ఈ యాప్ లాంచ్ అయిన మూడు రోజుల్లోనే 4.1 రేటింగ్‌ తో ఇండియా మోస్ట్ పాపుల‌ర్ ఆండ్రాయిడ్ అప్లికేష‌న్‌ గా నిలిచింది.

ఇంట‌ర్నెట్ సౌక‌ర్యం లేక‌పోయినా, సాధార‌ణ ఫీచ‌ర్ ఫోన్ల‌లోనూ ప‌నిచేయ‌డం ఈ యాప్ ప్ర‌త్యేక‌త‌. ఆధార్ ఆధారిత పేమెంట్స్‌ ను కూడా తొంద‌ర్లోనే ఈ యాప్‌ కు జ‌త చేయ‌నున్నారు. తమ బ్యాంకు అకౌంట్ల‌ను ఈ యాప్‌ కు అనుసంధానించ‌డం ద్వారా మొబైల్ ద్వారానే డ‌బ్బు పంప‌డం, పొందడం వంటివి చేసే వీలు క‌లుగుతుంది. అప్‌ గ్రేడెడ్ అన్‌ స్ట్ర‌క్చ‌ర్డ్ స‌ప్లిమెంట‌రీ స‌ర్వీస్ డేటా (యూఎస్ఎస్‌డీ) ద్వారా ఫీచ‌ర్ ఫోన్స్‌ లోనూ ఈ యాప్ ప‌నిచేస్తుంది. దీనిద్వారా అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకొనే వీలు కూడా క‌ల్పించ‌డం విశేషం. పేటీఎం, ఫ్రీచార్జ్‌ ల‌లో లేని ఆప్ష‌న్ కూడా భీమ్ యాప్‌ లో ఉంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ ఫేస్ లేని అకౌంట్లకు కూడా ఐఎఫ్ఎస్‌సీ, ఎంఎంఐడీ కోడ్స్ ద్వారా డ‌బ్బు పంపించే వీలుంది. క్యూఆర్ కోడ్స్ ఉప‌యోగించి కూడా పేమెంట్స్ చేయొచ్చు.

ప్ర‌స్తుతం భీమ్ యాప్‌ ను స‌పోర్ట్ చేస్తున్న బ్యాంకులు:

అల‌హాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్‌, యాక్సిస్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, బ్యాంక్ ఆఫ్ మ‌హారాష్ట్ర‌, కెన‌రా బ్యాంక్, కాథ‌లిక్ సిరియ‌న్ బ్యాంక్‌, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డీసీబీ, దేనా బ్యాంక్‌, ఫెడ‌ర‌ల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐడీబీఐ, ఐడీఎఫ్‌సీ, ఇండియన్ బ్యాంక్, ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్, ఇండ‌స్ ఇండ్‌, కర్ణాట‌క బ్యాంక్‌, క‌రూర్ వైశ్య‌, కోట‌క్ మ‌హీంద్రా, ఓబీసీ, పంజాబ్ నేష‌నల్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, సౌత్ ఇండియ‌న్‌, స్టాండ‌ర్డ్ చార్ట‌ర్డ్‌, ఎస్‌బీఐ, సిండికేట్‌, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజ‌యా బ్యాంక్.