కుమ్రం భీం, నిర్మల్ జిల్లాల్లో మంత్రి హరీశ్ పర్యటన

సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు ప్రాజెక్టులను పరిశీలిస్తూ.. పెండింగ్ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కుమ్రం భీం, నిర్మల్ జిల్లాల్లో ఇవాళ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. హరీశ్ రావు కు టీఆర్ఎస్ శ్రేణులు ఊరూరా ఘనస్వాగతం పలికారు.

కుమ్రం భీం జిల్లా వాంకిడి మండలంలో మినీ దాల్‌ మిల్‌ ను హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం కుమ్రం భీం ప్రాజెక్టు పనులను పరిశీలించి.. అధికారులతో సమీక్ష నిర్వహించారు. జైనూర్ మండలంలో 3 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదాములను ప్రారంభించారు. అనంతరం జైనూర్ పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారాయన. ఆ తర్వాత ఎలిజబెత్- క్రిస్టొఫర్  హైమాండర్ఫ్ దంపతుల వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు హరీశ్ రావు. గిరిజనుల  అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ ఈ టూర్ లో పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో నూతన హంగులతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ గోదాంను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. సదర్మట్ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం 516 కోట్లను మంజూరు చేసిందన్నారు. సదర్మట్ ప్రాజెక్ట్ పూర్తయితే 17వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు మంత్రి హరీష్ రావు.

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్నుకల్ దగ్గర సదర్ మట్ బ్యారేజీ నిర్మాణానికి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు. ఈ బ్యారేజీని పూర్తి చేసి ఆయకట్టులోని  రెండు పంటలకు నీళ్లిస్తామన్నారాయన. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎంపీ నగేశ్ ఈ భూమిపూజలో పాల్గొన్నారు.

సదర్ మట్ బ్యారేజీకి భూమిపూజ అనంతరం పలు ప్రారంభోత్సవాల్లో హరీశ్ రావు పాల్గొన్నారు.