ఉర్జిత్ ను ప్రశ్నించనున్న ప్రజాపద్దుల కమిటీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ ను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించనుంది. నోట్ల రద్దుకు సంబంధించి ఉర్జిత్‌ ను ఈ నెల 20న ప్రశ్నించనున్నట్లు పార్లమెంట్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్, కాంగ్రెస్ సభ్యుడు కేవీ థామస్ ప్రకటించారు. నోట్ల రద్దుకు కారణాలతో పాటు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా అని ఉర్జిత్‌ ను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన కరెన్సీ వివరాలు, నల్లధనం లెక్కలు చెప్పాలని కోరతామన్నారు. ఇప్పటి వరకు కొత్త కరెన్సీని ఎంత విడుదల చేశారో కూడా చెప్పాలన్నారు. నగదు రహిత లావాదేవీలకు దేశం సంసిద్ధంగా ఉందా? అనే అంశాలపై వివరణ అడగనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్‌ లోనే ఆర్బీఐ గవర్నర్‌ ను ప్రశ్నించాలని నిర్ణయించుకున్నప్పటికీ ప్రధాని మోదీ 50 రోజుల సమయం ఇవ్వాలని కోరడం వల్ల ఆగామని, ఆ సమయం ముగియడంతో ఇప్పుడు ప్రశ్నించనున్నట్లు తెలిపారు. పటేల్‌ తో పాటు ఆర్థిక శాఖ అధికారులు, రెవెన్యూ, ఆర్థిక శాఖ సెక్రటరీలను కూడా ప్రశ్నించనున్నట్లు కేవీ థామస్ వెల్లడించారు.