ఉపాధికి ఆధార్ అనుసంధానంలో రాష్ట్రం ఆదర్శం

ఆధార్‌ తో ఉపాధి హామీ జాబ్‌కార్డుల అనుసంధానంలోనూ రాష్ట్రం నెంబర్‌ వన్‌ గా నిలిచింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 95.47 శాతం అనుసంధాన్ని పూర్తి చేసింది.  ఒక్క హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో 90 శాతానికి పైగా అనుసంధాన ప్రక్రియను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పూర్తి చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ కింది 56 లక్షల 17వేల 360 జాబ్‌ కార్డులుండగా.. 53 లక్షల 63 వేల 66 జాబ్‌ కార్డులు ఆధార్‌ తో అనుసంధానమై ఉన్నాయి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ప్రకారం 2006 నుంచి 2015 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు జాబ్‌ కార్డులను ముద్రించి లబ్దిదారులకు పంపిణీ చేశారు.  మరోవైపు ఇటీవల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రీసర్వే చేసి బోగస్‌ కార్డులను ఏరివేసిన అధికారులు..ప్రస్తుతం పనిచేస్తున్న కూలీలు 40 లక్షల 62 వేల 958 మందిగా లెక్కతేల్చారు. దీని ప్రకారం ఇప్పటికే కొన్ని జిల్లాలకు కొత్త జాబ్‌ కార్డుల సరఫరా జరుగుతోంది. ఈ జాబ్‌ కార్డులకు పలు సాంకేతిక అంశాలను జోడించి కొత్తకార్డులను రూపొందించారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ త్వరలో మూడు రంగుల్లో జాబ్‌ కార్డులను జారీ చేస్తోంది. ఈ నెలాఖరులోగా ఉపాధి హామీ పథకం లబ్ధిదారులందరికి కొత్త జాబ్‌కార్డులను పంపిణీ చేసేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు 2016-17లో రాష్ట్రానికి కేంద్రం 10 కోట్ల పనిదినాలు కల్పించగా..ఇప్పటికే 9 కోట్ల పనిదినాలు పూర్తయ్యాయి. ఐతే ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో ఉపాధి పనులకు విపరీతమైన డిమాండ్‌ ఉన్నందున మరో ఆరుకోట్ల పనిదినాలు కల్పించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై స్పందించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ..మరో 4కోట్ల పనిదినాలు కల్పించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.