ఇంగ్లాండ్ టూర్ కు భారత జట్టు ఎంపిక

ఇంగ్లాండ్‌ తో జరగబోయే వన్డే, టీ ట్వంటీ సిరీస్‌ లకు భారత జట్లను ఎంపికచేశారు. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే…   వన్డే, టీ20 జట్లను ప్రకటించారు. ధోనీ కెప్టెన్సీ నుంచి వైదొలగడంతో రెండు ఫార్మాట్లకు కూడా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీని ఎంపికచేశారు. ధోనీ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాట్స్‌ మెన్‌గా జట్టులో చోటు నిలుపుకున్నాడు. సిక్సర్ల కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ మళ్లీ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. వన్డే, టీ ట్వంటీ జట్లకు ఎంపికయ్యాడు. ఫామ్‌ లో లేని రోహిత్‌ శర్మపై వేటు వేశారు.

వన్డే జట్టు… కెఎల్‌ రాహుల్, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లీ, ధోనీ, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, యువరాజ్‌, రహానే, హార్దిక్‌ పాండ్యా, అశ్విన్‌, జడేజా, అమిత్‌ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్‌, ఉమేష్‌ యాదవ్‌

టీ ట్వంటీ జట్టులో ధావన్‌ స్థానంలో మన్‌దీప్‌ సింగ్‌ ఎంపికయ్యాడు. వన్డే జట్టులో చోటు దక్కని సురేష్‌ రైనా.. టీ ట్వంటీ జట్టులో చోటు నిలుపుకున్నాడు.  వెటరన్‌ పేసర్‌ అశీష్‌ నెహ్రా, స్పిన్నర్‌ చాహల్‌తో పాటు రెండో వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ ఎంపికయ్యారు.

దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత యువరాజ్‌ సింగ్ మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. 2013 డిసెంబర్‌లో చిట్టచివరి సారిగా భారత జట్టు తరఫున వన్డే మ్యాచ్‌లో ఆడిన యువరాజ్.. అప్పటినుంచి ఇప్పటివరకు జట్టుకు దూరంగానే ఉండాల్సి వచ్చింది. అయితే, ఈమధ్య కాలంలో దేశవాళీ మ్యాచ్‌లలో యువరాజ్ బాగా ఆడుతుండడంతో జట్టుకు ఎంపికచేసినట్లు చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ చెప్పారు. తాము వీలైనంత బెస్ట్ టీంను ఎంపిక చేశామని ఎమ్మెస్కే తెలిపారు.

భారత జట్టు.. ఇంగ్లాండ్‌ తో జూన్‌ 15 నుంచి మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీల సిరీస్‌ ఆడనుంది. అయిదు టెస్ట్‌ల సిరీస్‌ ను 4-0తో చేజిక్కించుకున్న కోహ్లీ సేన.. వన్డే, టీ ట్వంటీల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.