ఆల్టబాగా యాహూ!

ఇంటర్నెట్‌ దిగ్గజం యాహూ ఇన్‌కార్పొరేషన్‌ పేరు మారనుంది. ఆల్టబా ఇన్ కార్పొరేషన్ అనే కొత్త పేరు పెట్టుకోనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే దాదాపు 32 వేల కోట్లు డీల్ కు యాహూను వెరిజోన్ కొనుగోలు చేసింది. అయితే యాహూ అకౌంట్లు రెండుసార్లు హ్యాకింగ్ కు గురైందన్న వార్తలతో ఈ డీల్ రద్దు కావొచ్చని అంతా భావించారు. అయితే వెరిజోన్ మాత్రం యాహూను బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. హ్యాకింగ్ పై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పందం అమల్లోకి వచ్చిన వెంటనే ప్రస్తుత సీఈఓ మరిస్సా మేయర్ రాజీనామా చేస్తారని కంపెనీ ప్రకటించింది. తన కోర్ ఇంటర్నెట్ బిజినెస్ అయిన డిజిటల్ అడ్వర్టైజింగ్, మీడియా ప్రాపర్టీస్‌, ఈమెయిల్ వంటి వాటిని ప్రముఖ వైర్ లెస్ దిగ్గజం వెరిజోన్ కు 4.83 బిలియన్ డాలర్లకు విక్రయించింది.

వెరిజోన్‌ యాహూతో డీల్‌ కుదుర్చుకున్న తర్వాత కంపెనీలో రెండుసార్లు అతిభారీ మొత్తంలో డేటా చోరి జరిగినట్లు వెల్లడైంది. తొలిసారి 500మిలియన్ కస్టమర్ల అకౌంట్లు, రెండోసారి వంద కోట్లకుపైగా అకౌంట్లు హ్యాక్ అయినట్లు కంపెనీ ప్రకటించింది. అయినా ఇవేవీ లెక్కచేయని వెరిజోన్  డీల్ కంప్లీట్  చేయాలని నిర్ణయించింది. ఒప్పందం పూర్తైన తర్వాత సీఈఓతో పాటు ఐదుగురు డైరెక్టర్లు కూడా రాజీనామా చేయనున్నట్లు రెగ్యూలేటరీ ఫైలింగ్‌లో యాహూ స్పష్టం చేసింది. మిగతా డైరెక్టర్లు మాత్రం ఆల్టబాలో కొనసాగనున్నారు. ఆల్టబా ఛైర్మన్ గా ఎరిక్‌ బ్రాండ్ట్‌ ను నియమించినట్లు కంపెనీ ప్రకటించింది.