అమెజాన్ కు సుష్మా స్వరాజ్ వార్నింగ్

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌పై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు చేసిన పనికి క్షమాపణలు చెప్పని పక్షంలో వీసాలు రద్దు చేస్తామని హెచ్చరించారు. అమెజాన్ కెనడా విభాగం, భారత జాతీయ పతాకం పోలిన మ్యాట్ లను  ఆన్‌లైన్లో విక్రయిస్తోంది.  ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అమెజాన్ తీరుపై ఆమె కన్నెర చేశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పడంతో‌పాటు ఆ ఉత్పత్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్వీట్ చేశారు. దీనిపై స్పందించని పక్షంలో అమెజాన్ అధికారులకు ఇచ్చిన వీసాలు రద్దు చేయడంతో పాటు కొత్త వాటిని మంజూరు చేయబోమని హెచ్చరించారు. ఈ అంశంలో అమెజాన్‌పై కఠిన చర్యలు చేపట్టాలని కెనడాలోని భారత హై కమిషన్‌ను సుష్మా స్వరాజ్ ఆదేశించారు.