హైదరాబాద్‌లో ఐఆర్‌సీ సదస్సు

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సదస్సుకు హైదరాబాద్ వేదికగా మారింది. నాలుగు రోజులపాటు జరిగే 77వ ఐఆర్‌సీ సదస్సు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇవాళ ప్రారంభం కానున్నది. ఈ సదస్సులో టెక్నికల్ ఎగ్జిబిషన్ సెషన్‌ను  మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రారంభిస్తారు. ఈ జాతీయ సదస్సుకు దేశ, విదేశీ ప్రతినిధులు సుమారు 2500 మంది హాజరువుతున్నారు.

నిత్యం రహదారులు రక్తసిక్తం అవుతున్న నేపథ్యంలో ప్రమాద రహిత రోడ్ల నిర్మాణాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టిసారించాయి. అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రమాదాలను నివారించడమే కాకుండా మెరుగైన ఫలితాలు సాధించవచ్చనే అభిప్రాయం నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల ను గుర్తించి ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణాలను, తగిన చర్యలను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ర్టాలతో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి కేంద్రం కార్యాచరణను రూపొందించింది. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యాచరణనే చేపట్టే విధంగా ఐఆర్‌సీలో నిపుణులు చర్చించనున్నారు. ఈ సదస్సులో తెలంగాణలోని రోడ్లు, భవనాలు, వంతెనల స్థితిగతులపై నివేదికను ఐఆర్‌సీకి ఆర్ అండ్ బీ ఈఎన్సీలు సమర్పిస్తారు. కొత్తగా చేపట్టే నిర్మాణాలు, వాటికి ఉపయోగించే నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులు, వాడుతున్న యంత్రాలు, ఇతర అంశాలను వివరించనున్నారు.